Pawan Singh : యూపీలో ఒక సింగర్ సంగీత ప్రదర్శన ఇస్తుండగా.. ఒక్కసారిగా తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో పలువురికి గాయాలయ్యాయి. ఉత్తర ప్రదేశ్ లోని గోరఖ్ పూర్ లో గోరఖ్ పూర్ మహోత్సవం నిర్వహించారు. సోమవారం రాత్రి ఈ కార్యక్రమం ఘనంగా జరిగింది. స్థానిక ఎంపీ, నటుడు రవికిషన్ కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ ఈవెంట్లో భాగంగా ప్రముఖ సింగర్, భోజ్పురి పవర్ స్టార్.. పవన్ సింగ్ మ్యూజిక్ పెర్ఫామెన్స్ ఇచ్చాడు.
భోజ్పురి సహా వివిధ భాషలకు చెందిన పాటల్ని పాడి, అక్కడి ప్రేక్షకుల్ని అలరించారు. అనంతరం ప్రేక్షకుల మధ్యే తన బర్త్ డే కేక్ కట్ చేశాడు. అయితే, ఏం జరిగిందో తెలీదు కానీ.. ఇదే సమయంలో ప్రేక్షకులంతా గందరగోళానికి గురై, స్టేజివైపు దూసుకెళ్లేందుకు ప్రయత్నించారు. ఉన్నట్లుండి ఒక్కసారిగా గందరగోళానికి గురైన ప్రేక్షకులు ఎటు వైపు వెళ్తున్నారో తెలీకుండా.. తలోదిక్కు వెళ్లేందుకు ప్రయత్నించారు. దీంతో తొక్కిసలాట జరిగింది. కొందరు ప్రేక్షకులు ఒకరిపై ఒకరు పడిపోవడంతో పలువురికి గాయాలయ్యాయి. ప్రేక్షకుల్ని అదుపు చేసేందుకు పోలీసులు, భద్రతా సిబ్బంది లాఠీ చార్జి చేశారు. అనంతరం పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.
ఈ ఈవెంట్ కు సంబంధించి నిర్వాహకులు.. పిల్లలు, మహిళల కోసం సరైన ఏర్పాట్లు చేయలేదని తెలుస్తోంది. దీనికి సంబంధించి విడుదలైన వీడియోలు చూస్తే ఈ విషయం అర్థమవుతుంది. గోరఖ్ పూర్ మహోత్సవ్ మూడు రోజులపాటు నిర్వహించాలని అధికారులు నిర్ణయించారు. ఈ నెల 11న ప్రారంభం కాగా.. నేడు ముగింపు వేడుక జరగనుంది. ఈ కార్యక్రమానికి యూపీ సీఎం ఆదిత్య యోగినాథ్ హాజరవుతారు.