Lok Sabha Polls | (స్పెషల్ టాస్క్ బ్యూరో)హైదరాబాద్, ఏప్రిల్ 18 (నమస్తే తెలంగాణ): ఓట్ల పండుగ జరుపుకునేందుకు దేశం సిద్ధమైంది. ఏడు విడతల్లో జరిగే సార్వత్రిక లోక్‌సభ ఎన్నికల మొదటి దశ పోలింగ్ ఈ నెల 19న(శుక్రవారం) జరగనుంది. తొలి దశ ఎన్నికల సమరంలో ఒకరినొకరు ఢీకొనేందుకు అధికార, విపక్షాలు సిద్ధమయ్యాయి. ఈ విడతలో 102 లోక్‌సభ నియోజక వర్గాల్లో జరిగే ఎన్నికల్లో 16.63 కోట్ల మంది తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.
దీని కోసం 1.87 లక్షల పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేశారు. 18 లక్షల మంది సిబ్బంది ఎన్నికల విధులు నిర్వహిస్తున్నారు. తొలి విడత లోక్‌సభ ఎన్నికలతో పాటు రెండు రాష్ర్టాల అసెంబ్లీలకు కూడా శుక్రవారం జరగనున్నాయి. ఎన్నికలకు అధికారులు ఏర్పాట్లన్నీ పూర్తి చేశారు. గట్టి బందోబస్తు చర్యలు చేపట్టారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరిగినా ఎదుర్కొనేందుకు యంత్రాంగాన్ని సిద్ధంగా ఉంచారు.
సర్వ శక్తులూ ఒడ్డుతున్న ఎన్డీఏ, ఇండియా కూటములు
మొదటి దశలో మిగతా దశల కన్నా ఎక్కువ స్థానాల్లో ఎన్నికలు జరుగుతుండటం అన్ని పార్టీలకు ఈ ఎన్నికలు ప్రధానంగా మారాయి. మొదటి విడతలో ఆధిక్యం చూపితే అది మిగతా దశల్లో కూడా ఆ ఆధిక్యం కొనసాగుతుందని పార్టీలు ఆశిస్తున్నాయి. మూడోసారి అధికారాన్ని చేజిక్కించుకోవడానికి బీజేపీ, దాని మిత్రపక్షాలు సర్వశక్తులూ ఒడ్డుతున్నాయి.
ఇంతవరకు సొంతంగా విజయం రుచి చూడని తమిళనాడులో, తొలిసారిగా కేరళలో విజయం సాధించాలని కమలం పార్టీ గట్టి పట్టుదలతో ఉంది. ఇతర పార్టీలు సైతం ఎన్నికల్లో గెలుపుపై గట్టి ఆశలే పెట్టుకున్నాయి. మోదీ ప్రజా వ్యతిరేక, మత విద్వేష చర్యలు తమను గెలిపిస్తాయని, బీజేపీ పాలన పట్ల ప్రజలు విసిగిపోయారని, ఆ పార్టీపై వ్యతిరేకత తమకు బాగా లాభించి అధికారాన్ని తెచ్చి పెడుతుందని వారు ఆశపడుతున్నారు.
బస్తర్‌లో భారీ భద్రత
ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టుల ప్రాబల్యంగల బస్తర్ లోక్‌సభ నియోజకవర్గంలో కట్టుదిట్టమైన భద్రత నడుమ నేడు పోలింగ్ జరగబోతున్నది.ఎన్నికలను బహిష్కరించాలని మావోయిస్టులు పిలుపునివ్వడంతో భద్రతా దళాలకు ఎన్నికల నిర్వహణ సవాలుగా మారింది.
ఎన్నికలు జరిగే రాష్ర్టాలు
మొదటి విడతలో అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, బీహార్, ఛత్తీస్‌గఢ్, మధ్య ప్రదేశ్, మహారాష్ట్ర, మణిపూర్, మేఘాలయ, మిజోరం, నాగాలాండ్, రాజస్థాన్, సిక్కిం, తమిళనాడు, త్రిపుర, ఉత్తర ప్రదేశ్, ఉత్తరాఖండ్, పశ్ఛిమ బెంగాల్, అండమాన్ నికోబార్ దీవులతో సహా కేంద్ర పాలిత ప్రాంతాలు జమ్మూ కశ్మీర్, లక్షద్వీప్, పుదుచ్చేరి లలో ఎన్నికలు జరుగనున్నాయి.
గెలిచి నిలుస్తారా?
మొదటి విడత ఎన్నికల బరిలో పలువురు ప్రముఖులు ఉన్నారు. వారిలో కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ మహారాష్ట్రలోని నాగ్‌పూర్ నుంచి బరిలో ఉన్నారు. మరో ప్రముఖుడు జితిన్ ప్రసాద్ యూపీలోని పిలిభిత్ లోకసభ నియోజక వర్గం నుంచి, తెలంగాణ మాజీ గవర్నర్ తమిళి సై తమిళనాడులోని చెన్నై సౌత్ నుంచి బీజేపీ అభ్యర్థిగా, కేంద్ర మాజీ మంత్రి పి.చిదంబరం కుమారుడు కార్తీ చిదంబరం తన తండ్రి ఏడుసార్లు నెగ్గిన శివగంగ లోక్‌సభలో పోటీ చేస్తున్నారు.
ఇక బీజేపీ తమిళనాడు అధ్యక్షుడైన కే అన్నామలై కోయంబత్తూరు నుంచి, డీఎంకే ఎంపీ దయానిధి మారన్ చెన్నై సెంట్రల్ నుంచి, మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కమల్‌నాథ్ కుమారుడు నకుల్ నాథ్ తిరిగి చింద్వాడా నుండి కాంగ్రెస్ తరపున, పశ్చిమ ఉత్తరప్రదేశ్‌లోని సహరాన్పూర్ నుంచి ఇమ్రాన్ మసూద్ పోటీలో ఉన్నారు. బీహార్ మాజీ ముఖ్యమంత్రి జితన్ రామ్ మాంఝీ ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా బీహార్‌లోని గయా స్థానం నుంచి పోటీ చేస్తున్నారు. లోక్‌సభలో కాంగ్రెస్ ఉప నేతగా ఉన్న గౌరవ్ గొగోయ్, అస్సాంలోని జోర్హాట్ నుంచి ఈసారి కూడా పోటీ పడుతున్నారు.
ఓటరు వేసవి తాపాన్ని జయిస్తాడు: సీఈసీ
భారత దేశ ప్రజాస్వామ్య మహత్తర భావ వ్యక్తీకరణ ఎన్నికల ద్వారా జరుగుతుందని ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) రాజీవ్ కుమార్ గురువారం ఓ వీడియో సందేశంలో చెప్పారు. ఓటు వేయడం వంటి ఉత్తమమైన మార్గం మరొకటి ఏదీ లేదన్నారు. వేసవి కాలంలో సూర్య ప్రతాపం నుంచి కాపాడుకోవడానికి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఓటర్లను కోరారు. అయితే భారతీయ ఓటరు వేసవి తాపాన్ని జయిస్తాడని, ఓటరుకుగల చైతన్యం, స్ఫూర్తి తనకు తెలుసునని వ్యాఖ్యానించారు.
నాలుగో విడతకు నోటిఫికేషన్ విడుదల
సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా జరగనున్న నాలుగో విడత ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం గురువారం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ విడతలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బీహార్, ఝార్ఖండ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒడిశా, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్‌తోపాటు కేంద్రపాలిత ప్రాంతమైన జమ్మూకశ్మీర్‌లోని 96 లోక్‌సభ స్థానాలకు ఎన్నికలు జరుగుతాయి. గురువారం నుంచే నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కాగా ఈ నెల 25 వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. మే 13న పోలింగ్ జరుగుతుంది. జూన్ 4న ఫలితాలు వెల్లడిస్తారు.