లక్నో: యూపీలోని ఘజియాబాద్‌లో ఇటీవల ఓ వ్యక్తిని అతని స్నేహితులు కత్తితో పొడిచి చంపిన విషయం తెలిసిందే. ఆ ఘటన పట్ల సీఎం యోగి ఆదిత్యనాథ్(CM Yogi Adityanath) స్పందించారు. స్నేహం ముసుగులో ఓ వ్యక్తిని హత్య చేయడం ఆమోదయోగ్యం కాదు అని ఆదిత్యనాథ్ అన్నారు. తమ పిల్లలకు క్రమశిక్షణ, మార్గదర్శనం చేయలేకపోతున్న వారు తీవ్రమైన తప్పులు చేస్తున్నారని అన్నారు. ఆవును జాతీయ జంతువుగా ప్రకటించాలని ఓ మౌలానా చేసిన సూచనను ఆయన వ్యతిరేకించారు. భారతీయ సంస్కృతిలో గోవును మాతగా ఆరాధిస్తారన్నారు. అటువంటి బంధానికి ప్రత్యేకంగా గుర్తింపు అవసరం లేదన్నారు. తల్లిని గౌరవించాలని ఓ కుమారుడికి చెప్పాల్సిన అవసరం లేదని, తల్లులకు, గోవుల పట్ల పిల్లలు ప్రేమతో ఉంటారన్నారు.
గోవుల ఫోటోలను సోషల్ మీడియాలో పోస్టు చేసి, బక్రీద్ శుభాకాంక్షలు చెబుతున్న వారికి ఆయన వార్నింగ్ ఇచ్చారు. యూపీలో గో హత్య జరిగే కఠిన చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు. బంగ్లాదేశ్, పాకిస్థాన్‌లో హిందువులపై దాడి జరుగుతుంటే, వివిధ మతాలకు చెందిన నేతలు మౌనంగా ఉన్నారని విమర్శించారు స్థానిక ప్రభుత్వ చర్యలను అక్కడి మత నేతలు ఖండించడం లేదన్నారు. భారత్‌కు పాకిస్థాన్ శత్రువు అని ఆ నేతలు పబ్లిక్‌గా చెప్పాలన్నారు. గతంలో రామనవమి, జన్మాష్టమి, దుర్గాపూజా, కన్వర్ యాత్ర పండుగల వేళ రాష్ట్రంలో అలజడి పరిస్థితి ఉండేదని, కానీ ఇప్పుడు ప్రశాంతంగా ఆ పండుగలను నిర్వహిస్తున్నట్లు చెప్పారు.
గతంలో మహిళలు, విద్యార్థులు, వ్యాపారులు అభద్రతాభావంలో ఉండేవారని, కానీ ఇప్పుడు పరిస్థితి మారిందన్నారు. కరుణ, అహింసా అనేవి ఉత్తమ మానవ గుణాలని, కానీ శాంతి, భద్రతను ఎదుర్కొనేందుకు సమాజం సిద్ధంగా ఉండాలన్నారు. శ్రీరాముడు, శ్రీకృష్ణుడి బోధనలు ఆయన గుర్తు చేస్తూ.. ప్రజలను, మహిళలను, అణగారిన వారిని రక్షించుకోవాలన్నారు. జాతి వ్యతిరేక కార్యకలాపాలను అడ్డుకోవాలన్నారు.