చెన్నై: మత్స్యకారులపై సముద్రపు దొంగలు దాడి చేశారు. వారి బోట్లలో ఉన్న వలలు, జీపీఎస్ పరికరాలను దోచుకున్నారు. గాయపడిన 17 మంది మత్స్యకారులు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. (Tamil Nadu fishermen injured) శుక్రవారం తమిళనాడులోని నాగపట్నం జిల్లాకు చెందిన 30 మందికి పైగా మత్స్యకారులు చేపలవేట కోసం ఫైబర్ బోట్లలో సముద్రంలోకి వెళ్లారు. శ్రీలంక సముద్రపు దొంగలు వీరిని లక్ష్యంగా చేసుకున్నారు. స్పీడ్ బోట్లో వచ్చిన ఆరుగురు వ్యక్తులు తమిళనాడు మత్య్సకారులపై పదునైన ఆయుధాలతో దాడి చేశారు. వారి బోట్ల నుంచి సుమారు పది లక్షల విలువైన వలలు, జీపీఎస్ పరికరాలను ఎత్తుకెళ్లారు.
కాగా, శ్రీలంక సముద్రపు దొంగల దాడిలో 17 మంది తమిళనాడు మత్స్యకారులు గాయపడ్డారు. తీరానికి చేరుకున్న తర్వాత వారంతా ప్రభుత్వ జిల్లా హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు. తమిళనాడు మత్స్యకారుల నేతలు ఈ సంఘటనపై ఆందోళన వ్యక్తం చేశారు. భారత జలాల్లో ఈ దాడి జరిగిందని ఆరోపించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జోక్యం చేసుకోవాలని డిమాండ్ చేశారు. మళ్లీ ఇలాంటి సంఘటనలు పునరావృతమైతే నిరవధికంగా నిరసన చేస్తామని హెచ్చరించారు.