న్యూఢిల్లీ: చపాతీలు చేసే సమయంలో వాటిపై ఉమ్మివేస్తున్న ఓ కుక్(Cook Arrested) వీడియో ఇటీవల వైరల్ అయ్యింది. ఆ కేసులో పోలీసులు చర్యలు తీసుకున్నారు. చపాతీలపై ఉమ్మిని ఆ వంటమనిషిని అదుపులోకి తీసుకున్నారు. ఘజియాబాద్‌లోని రోడ్డువైపున ఉన్న ఓ ఫుట్ అవుట్‌లెట్‌లో ఓ వ్యక్తి చపాతీలపై ఉమ్మి ఆ తర్వాత వాటిని కాల్చేవాడు. అయితే కొందరు కస్టమర్లు దాన్ని గుర్తించి వీడియో తీశారు. ఢిల్లీ-మీరట్ దారిలో ఉన్న వర్దమాన్ పురం పోలీసు స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది. చపాతీపిండిపై ఉమ్మివేస్తున్న కుక్ వీడియోను కొందరు కస్టమర్లు తీశారు. ఆ తర్వాత ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
గురువారం సాయంత్రం నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడిని మురాద్‌నగర్‌కు చెందిన జావెద్ అన్సారీగా గుర్తించారు. కవినగర్ ఏసీపీ సూర్యబలి మౌర్య మాట్లాడుతూ చికెన్ పాయింట్ అనే హోటల్లో ఈ ఘటన జరిగిందన్నారు. వసీమ్ అనే వ్యక్తి ఆ హోటల్ ఓనర్. ఈ ఘటన జరిగిన సమయంలో అతను హోటల్లో ఉన్నాడా లేదా అన్న విషయాన్ని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఆ హోటల్ లైసెన్స్ కూడా పరీక్షిస్తున్నారు. ఆహార భద్రత, రక్షణ నిమిత్తం రిపోర్టులను సేకరిస్తున్నట్లు ఏసీపీ చెప్పారు.