బెంగళూరు, ఆగస్టు 2: అత్యాచారం కేసులో మాజీ ప్రధాని మనవడు, మాజీ ఎంపీ, సస్పెన్షన్కు గురైన జేడీఎస్ నాయకుడు ప్రజ్వల్ రేవణ్ణకు ప్రత్యేక కోర్టు శనివారం యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. ఆయనకు మరో రూ.10 లక్షల జరిమానా కూడా విధిస్తూ ఎంపీ/ఎమ్మెల్యేల ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి సంతోష్ గజానన్ భట్ తీర్పు వెలువరించారు.
హసన్ జిల్లాలోని హోలెనరసీపురాలో ఉన్న రేవణ్ణ కుటుంబానికి చెందిన గన్నికడ వ్యవసాయక్షేత్రంలో పనిచేస్తున్న ఓ 48 ఏండ్ల మహిళపై జరిగిన అత్యాచారం కేసులో కోర్టు ఈ తీర్పు వెలువరించింది. తన పట్ల కనికరం చూపాలని రేవణ్ణ న్యాయమూర్తిని అర్థిస్తూ రోదించారు. కాగా, ఈ కేసును దర్యాప్తు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) 2024 సెప్టెంబర్లో 1,632 పేజీలతో చార్జిషీట్ని దాఖలు చేసింది. మొత్తం 113 మంది సాక్షులను పేర్కొంది.