కోల్కతా, జూలై 25: మితాహారానికి పరిమితమయ్యే మధుమేహ రోగుల కోసం ప్రపంచంలోనే మొట్టమొదటిసారి ఘుమఘుమలాడుతూ నోరూరించే ఓ ప్రత్యేక వంటకం తయారైంది. డయాబెటిక్-ఫ్రెండ్లీ బిర్యానీ అనే కొత్త వంటకాన్ని కోల్కతాలోని ప్రముఖ రెస్టారెంట్ చెయిన్ అవధ్ 1590 ఇటీవల ప్రవేశపెట్టింది. డయాబెటిక్ రోగులకు అవసరమైన పోషకాలతోపాటు ఆరోగ్యంపై అధిక శ్రద్ధ చూపించే భోజన ప్రియులను దృష్టిలో ఉంచుకుని ఈ బిర్యానీని ప్రవేశపెట్టినట్లు హోటల్ యాజమాన్యం తెలిపింది.
నగరంలోని సాల్ట్ లేక్ ఔట్లెట్లో ఈ బిర్యానీ ప్రారంభోత్సవం ప్రముఖ బెంగాలీ నటుడు సోహం చక్రవర్తి, ప్రముఖ డైటీషియన్ నిధి ప్రకాశ్ సమక్షంలో జరిగింది. అవధ్ 1590 ఔట్లెట్లు అన్నిటిలో లభ్యమయ్యే డయాబెటిక్ ఫ్రెండ్లీ బిర్యానీ టైప్ 1, టైప్ 2 మధుమేహ వ్యాధిగ్రస్తుల కోసం ప్రత్యేకంగా రూపొందించారు.
మాంసాహార ప్రియుల కోసం డయాబెటిక్ ముర్గ్ బిర్యానీ(చికెన్) రూ. 350కి లభిస్తుంది. శాకాహారుల కోసం డయాబెటిక్ సబ్జీ బిర్యానీ అందుబాటులో ఉంది. దీని ధర రూ. 275. ఫైబర్ అధికంగాఉండే కూరగాయలతోపాటు సోయా గింజలతో దీన్ని తయారుచేస్తున్నారు. సాంప్రదాయ అవధి శైలిలో మంచి పోషక విలువలతో కూడిన వంటకంగా దీన్ని తీర్చిదిద్దినట్లు డాక్టర్ నిధి ప్రకాష్ తెలిపారు.
సాధారణంగా తెల్ల బియ్యం, ఆలుగడ్డలతో రెస్టారెంట్లలో తయారుచేసే సాంప్రదాయ బిర్యానీని డయాబెటిక్ రోగులు దూరం పెడుతుంటారని, వీటికి ప్రత్యామ్నాయంగా తాము ఉప్పుడు బియ్యం, చిలకడదుంపను వాడామని ఆమె వివరించారు. ఇవి డయాబెటిక్ రోగులకు ఎటువంటి హాని చేయవని, మంచి పోషక విలువలను అందచేస్తాయని ఆమె తెలిపారు.