తిరువనంతపురం: హిందువుల దేవుడైన గణేశుడిపై ఇటీవల కేరళ స్పీకర్ ఏఎన్ షంషీర్(Speaker A N Shamseer) వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఎర్నాకుళం జిల్లాలో జరిగిన ఓ స్కూల్ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. సైన్స్ అండ్ టెక్నాలజీకి బదులుగా హిందూ మత విశ్వాసాలను పిల్లలపై కేంద్రం రుద్దుతున్నట్లు ఆయన ఆరోపించారు. గణేశుడు కేవలం కల్పన మాత్రమే అని, ఎటువంటి సైంటిఫిక్ ఆధారాలు లేవని ఆయన అన్నారు. దీనిపై కేరళలో దుమారం రేగుతోంది.ఈ నేపథ్యంలో ఇవాళ సీపీఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి ఎంవీ గోవిందన్ మీడియా సమావేశంలో మాట్లాడారు. హిందువుల దేవుడిపై వివాదాస్పద కామెంట్ చేసిన స్పీకర్ షంషీర్ క్షమాపణలు చెప్పడం లేదని గోవిందన్ తెలిపారు. స్పీకర్ షంషీర్ చెప్పింది పూర్తిగా నిజమని ఆయన అన్నారు. బీజేపీతో పాటు రైట్ వింగ్ సంస్థలైన విశ్వ హిందూ పరిషత్.. స్పీకర్ షంషీర్కు వ్యతిరేకంగా ప్రచారం చేపట్టినట్లు ఆయన ఆరోపించారు.