Sky Ladder | ఢిల్లీ, మార్చి 16: చందమామ కథలో చదివినట్టు రెక్కల గుర్రం వేసుకొని ఆకాశంలో ఎగరాలని ఉందా? పక్షుల్లా రెక్కలు కట్టుకొని నింగిలో విహరించాలని కలలు కంటున్నారా? ఆకాశానికి నిచ్చెన వేసి నక్షత్రాలను లెక్కపెట్టాలని అనుకుంటున్నారా? చందమామ కథల్లో లాగా రెక్కల గుర్రం, పక్షుల్లా రెక్కలంటే సాధ్యపడకపోవచ్చు గానీ, ఆకాశానికి నిచ్చెన వేసే రోజులు దగ్గర్లోనే ఉన్నాయి. ఎంచెక్కా కేబుళ్ల సాయంతో ఎలివేటరో, లిఫ్టో ఎక్కి చందమామను దగ్గర్నుంచి వీక్షించే గడియలు రాబోయే దశాబ్దాల్లో మనం చూసినా ఆశ్చర్యపోనక్కర్లేదు. సైన్స్ ఫిక్షన్ సినిమాల్లో మాత్రమే జరిగే ఈ అసాధ్యాన్ని సుసాధ్యం చేయడం కష్టమేమీ కాదని శాస్త్రవేత్తలు ఆశాభావం వ్యక్తంచేస్తున్నారు.
స్పేస్ ఎలివేటర్ ఆలోచన ఇప్పటిది కాదు. 1895లో రష్యన్ శాస్త్రవేత్త కొన్స్టెంటిన్ సియోల్కోవ్క్సీ ఇలాగే కలలు గన్నారు. భూమిపై నుంచి 36 వేల కిలోమీటర్ల ఎత్తులో భూ స్థిర కక్ష్యలో ఉండే ఓ ఉపగ్రహం అతి భారీ కేబుల్‌ను స్థిరంగా పట్టుకొని ఉంచుతుంది. ఇది ఎల్లప్పుడూ ఒకే ప్రదేశంలో, అంటే భూమధ్య రేఖ వద్ద తిరుగుతుంది. అంతరిక్షం నుంచి ఒక కేబుల్ భూమికి వేలాడుతూ ఉంటుంది. గురుత్వాకర్షణ శక్తి, సెంట్రిఫ్యూయల్ ఫోర్స్ దీన్ని పడిపోకుండా స్థిరంగా ఉంచుతాయి. సముద్రంలో నౌక లంగరు వేసినట్టే.. ఈ కేబుల్ భూమిపై పర్వతం లేదా టవర్ లేదా సముద్రంలో మొబైల్ టవర్‌కు లంగర్ వేసి ఉంటుంది. విద్యుత్తు సాయంతో ఎలివేటర్ లేదా లిఫ్ట్‌లో వెళ్లినట్టు వ్యోమగాములు ఆ కేబుల్‌ను అధిరోహిస్తారు.
ఉపగ్రహాలు, ఇతర సామగ్రి, మానవులను కూడా అంతరిక్షంలోకి తీసుకెళ్తారు. రాకెట్ అవసర లేకుండా, అతి తక్కువ ఖర్చుతో ఎలాంటి కాలుష్యం లేకుండా ఇది పని చేస్తుంది. అలా వెళ్లాలంటే ఆ కేబుల్ కచ్చితంగా స్టీల్ కంటే 50 రెట్లు దృఢంగా ఉండాలి. అందుకు కార్బన్ నానోట్యూబ్స్ లేదా గ్రాఫీన్ లాంటి పదార్థాలు అవసరం. కేబుల్ నిర్మాణం పడిపోతుందని భయపడాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే, కేబుల్ ద్రవ్యరాశిలో 1 శాతం బరువున్న పేలోడ్లను ఎలాంటి ఇబ్బంది లేకుండా పైకి చేర్చవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఈ స్పేస్ ఎలివేటర్ కల గనుక ఆచరణలోకి వస్తే అంతరిక్ష యాత్రలు సర్వసాధారణం అయిపోతాయి. అంతరిక్ష పరిశోధనల్లో పురోగతి, రోజురోజుకు వస్తున్న టెక్నాలజీ దృష్ట్యా రాబోయే దశాబ్దాల్లో ఇది సాకారం కావొచ్చని శాస్త్రవేత్తలు చెప్తున్నారు.