హైదరాబాద్ : ఆరు రోజుల పాటు రాత్రి 11.30గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 5.30 గంటల పాటు రిజర్వేషన్ బుకింగ్ సౌకర్యాన్ని నిలిపివేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. నేటి అర్ధరాత్రి నుంచి 20వ తేదీ వరకు సేవల్లో అంతరాయం ఉంటుందని తెలిపింది. కరెంట్ బుకింగ్, టికెట్ల రద్దు సేవలు అందుబాటులో ఉండవి స్పష్టం చేసింది. రైల్వే డేటా అప్డేట్ చేస్తుండడంతో సేవలకు అంతరాయం కలుగుతుందని పేర్కొంది. గతేడాది కొవిడ్ మహమ్మారి నేపథ్యంలో రైలు సర్వీసులను రద్దు చేయగా.. ఆ తర్వాత దశలవారీగా ప్రత్యేక రైళ్లు అందుబాటులోకి తీసుకువచ్చిన విషయం తెలిసిందే.
ప్రస్తుతం ప్రత్యేక రైళ్లను రద్దు చేయాలని రైల్వేశాఖ నిర్ణయించింది. ప్రస్తుతం రైళ్ల నంబర్‌కు ముందు ఉన్న ‘0’ను తొలగించి.. కొవిడ్‌కు ముందు ఉన్న చార్జీలు, టైమ్‌టేబుల్ ప్రకారం రైల్వే సేవలను అందుబాటులోకి తేనున్నది. ఈ క్రమంలోనే దక్షిణ మధ్య రైల్వే సర్వర్లను అప్డేట్ చేస్తున్నది. టికెటింగ్ సేవలపై ప్రభావం లేకుండా రాత్రి వేళల్లో రిజర్వేషన్ సేవలను నిలిపివేస్తున్నట్లు పేర్కొన్నది. టికెట్ రిజర్వేషన్, రైలు నంబర్లలో మార్పులను గమనించి సహకరించాలని కోరింది. ప్రయాణికులు విచారణ కౌంటర్లు, హెల్ప్‌డెస్క్‌ల వద్ద సమాచారం తెలుసుకోవచ్చని, ప్రయాణికులకు జరుగుతున్న అసౌకర్యానికి చింతిస్తున్నట్లు పేర్కొన్నది.