
న్యూఢిల్లీ: ప్రధాని మోదీ రక్షణ కోసం కొత్త మెర్సిడీస్ మేబాచ్ ఎస్650 కారును కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. ఆ కారు ధర సుమారు 12 కోట్లు ఉన్నట్లు వార్తలు వెలుబడుతున్న విషయం తెలిసిందే. ఇటీవల రష్యా అధ్యక్షుడు పుతిన్‌ను కలిసేందుకు మోదీ ఆ కారులోనే వెళ్లారు. అయితే అంత ఖరీదైన కారును ప్రధాని కోసం కొన్నారా అని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. కారు ధరపై వస్తున్న ఊహాగానాలకు కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెరదించే ప్రయత్నం చేశాయి. మీడియాలో వస్తున్నట్లు ఆ కారు ధర అంత ఉండదని కొన్ని వర్గాలు తెలిపాయి. సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న ధరతో పోలిస్తే.. దాంట్లో మూడవ వంతు ఉంటుందని చెబుతున్నారు. అయితే ఇలాంటివి రెండు కార్లను మోదీ కోసం తీసుకున్నట్లు తెలుస్తోంది. వాస్తవానికి గతంలో రేంజ్ రోవర్ వోగ్, టొయాటా ల్యాండ్ క్రూయిజర్లను ప్రధాని కోసం వాడారు. కొత్తగా తీసుకున్న కార్లు అప్‌గ్రేడ్ కాదు అని, కేవలం రోటీన్‌గా రిప్లేస్మెంట్ చేసినవే అని అధికారులు తెలిపారు. గతంలో వాడిన మోడళ్లను బీఎండబ్ల్యూ తయారు చేయడం లేదని, అందుకే కొత్త కార్లను తీసుకున్నట్లు కొన్ని వర్గాలు వెల్లడించాయి.
స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ ప్రధానికి రక్షణ కల్పిస్తోంది. అయితే ఆరేళ్లకు ఒకసారి ప్రధాని వాహనాలను ఎస్పీజీ మార్చేస్తుంది. కానీ ప్రధాని మోదీ తన పాత కార్లను ఎనిమిదేళ్ల వరకు వినియోగించారు. సెక్యూర్టీ ఆడిట్ సమయంలో ఈ అంశం ప్రస్తావనకు రావడంతో కొంత ఆందోళన వ్యక్తం అయ్యింది. సెక్యూర్టీ బలహీనపడే అవకాశం ఉన్నందున భద్రతను పెంచాలని భావించారు. పొంచి ఉన్న ముప్పు ఆధారంగా ప్రధాని కోసం ఎస్పీజీ వాహనాలను తీసుకుంటుందని కొన్ని వర్గాలు తెలిపాయి. రక్షణ ఎవరికైతే కల్పిస్తున్నారో.. వారి అభిప్రాయం తీసుకోకుండానే ఎస్పీజీ కొత్త వాహనాలను ఖరీదు చేసే అవకాశం ఉంటుందట.
కారుకు ఉన్న ప్రత్యేక ఫీచర్ల గురించి పబ్లిక్‌గా చర్చించడం సరికాదు అని, ఇది జాతీయ ప్రయోజనాలను దెబ్బతీస్తుందని, కేవలం ప్రాణ ముప్పును దృష్టిలో పెట్టుకుని వాహనాలను అప్డేట్ చేస్తున్నట్లు ఓ అధికారి తెలిపారు. కారు ఎంపిక విషయంలో ప్రధాని మోదీ ఎటువంటి ప్రిఫరెన్స్ ఇవ్వలేదన్నారు. కానీ మాజీ ప్రధాని మన్మోహన్ కోసం తీసుకున్న రేంజ్ రోవర్ కార్లను సోనియా వాడుతున్నట్లు కొందరు ఆరోపించారు.
ఆయుధ దాడిని తట్టుకునే రీతిలో మెర్సీడీజ్ మేబాచ్ ఎస్650ని డిజైన్ చేశారు. హై క్యాలిబర్ బుల్లెట్లను కూడా ఈ కారు అడ్డుకుంటుంది. ఆ కారుకు చెందిన విండోలు, బాడీ షెల్ చాలా దృఢంగా ఉన్నట్లు తెలిపారు. దీంట్లో 6 లీటర్ల ట్విన్ టర్బో వీ12 ఇంజిన్‌ను వాడుతున్నారు. టాప్ స్పీడ్‌ను 160 కిలోమీటర్ల వేగానికి పరిమితం చేశారు. ఒకవేళ టైర్లు పంక్చర్ అయినా.. కారు దూసుకెళ్లే రీతిలో ప్రత్యేకంగా ఫ్లాట్ టైర్లను ఫిక్స్ చేశారు.