సోనిపట్: రెజ్లర్ నిషా దహియా హత్య కేసులో ఇద్దరు నిందితులను ఢిల్లీ స్పెషల్ బ్రాంచ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిలో ప్రధాన నిందితుడు, నిషా రెజ్లింగ్ కోచ్ పవన్ బరాక్తోపాటు అతని సన్నిహితుడు సచిన్ దహియా ఉన్నారు. నిందితులిద్దరినీ ద్వారకలో అరెస్ట్ చేసినట్లు ఢిల్లీ పోలీసులు తెలిపారు. ప్రధాన నిందితుడు పవన్ బరాక్ నుంచి లైసెన్స్డ్ రివాల్వర్‌ను స్వాధీనం చేసుకున్నారు. పవన్‌తోపాటు అరెస్టైన సచిన్‌పై గతంలో కూడా రెండు కేసులున్నాయని పోలీసులు తెలిపారు.
కాగా, పరారీలో ఉన్న పవన్ బరాక్ ఆచూకీ దొరకకపోవడంతో గురువారం అతని భార్య సుజాత, బావమరిది అమిత్‌లను రోహ్తక్లో అరెస్ట్ చేశారు. నిషా దహియా హత్య జరిగిన ప్రదేశంలో వాళ్లు కూడా ఉన్నట్లు ఆధారాలు లభించాయని పోలీసులు చెప్పారు. ఇవాళ నిందితులను కోర్టులో ప్రవేశపెట్టే అవకాశం ఉన్నది. ఈ నెల 10న హర్యానా రాష్ట్రం సోనిపట్ జిల్లాలో నిషా దహియా, ఆమె సోదరుడు దారుణ హత్యకు గురయ్యారు. నిషా కోచ్, అతని సన్నిహితుడే వారిని కాల్చిచంపినట్లు ఆరోపణలున్నాయి.