చెన్నై: తమిళనాడులోని తిరువళ్లూరులో దారుణం జరిగింది. బీమా డబ్బు కోసం కన్న తండ్రిని కొడుకులే విషపూరిత పాముతో కాటు వేయించి చంపారు. అయితే వారు ఆయనను దాన్ని ప్రమాదవశాత్తు జరిగినదిగా చిత్రీకరించేందుకు దవాఖానకు తీసుకెళ్లారు. అయితే బీమా డబ్బు కోసమే వారు ఇలా చేశారని పోలీసుల దర్యాప్తులో తేలింది. పోలీసుల కథనం ప్రకారం& ప్రభుత్వ స్కూలు లేబరేటరీ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న ఈపీ గణేశన్(56) అక్టోబర్‌లో విగత జీవిగా కనిపించారు.
పాము కాటుకు గురై తమ తండ్రి మరణించినట్లు గణేశన్ కుమారులు పోలీసులకు తెలిపారు. గణేశన్ పేరున ఉన్న బీమా పాలసీల డబ్బు కోసం గణేశ్ ఇద్దరు కుమారులు క్లెయిమ్ చేయగా దాన్ని ప్రాసెస్ చేసే క్రమంలో కంపెనీ వారికి అనుమానాలు తలెత్తాయి. దీంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. తమ తండ్రిని పాముతో కాటు వేయించి చంపేశాక కుమారులు ఆయనను ఆలస్యంగా దవాఖానకు తీసుకెళ్లారు. ఈ విషయం పోలీసుల దర్యాప్తులో తేలింది. నిందితులను అరెస్ట్ చేశారు.