న్యూఢిల్లీ: పెహల్గామ్ దాడి నేపథ్యంలో భారత్ తీసుకున్న కఠిన నిర్ణయాలను వ్యతిరేకిస్తూ పాకిస్థాన్(Pakistan) ప్రతీకార చర్యలకు దిగింది. ఉగ్రదాడిలో పాకిస్థాన్ హస్తం ఉన్నట్లు భారత్ పేర్కొన్న విషయం తెలిసిందే. దీనిపై పాకిస్థాన్ సర్కారు స్పందించింది. పెహల్గామ్ దాడిలో తమ ప్రమేయం ఉన్నట్లు ఆధారాలు చూపాలని పాకిస్థాన్ కోరింది. ప్రపంచ దేశాలకు ఆ ఆధారాలను వెల్లడించాలని పాకిస్థాన్ డిప్యూటీ ప్రధాని, విదేశాంగ మంత్రి ఇషాక్ దార్ తెలిపారు. ఇవాళ ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. రక్షణ శాఖ మంత్రి ఖవాజా ఆసిఫ్, ఇతరులతో కలిసి మాట్లాడారు.
శ్రీనగర్‌లోకి కొందరు విదేశీయులు ఆయుధాలతో ప్రవేశించారని, దానికి సంబంధించిన ఆధారాలు తమ వద్ద ఉన్నాయని డిప్యూటీ ప్రధాని దార్ తెలిపారు. భారత ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు ఆ వ్యక్తులను శ్రీనగర్‌లో దాచినట్లు పాక్ డిప్యూటీ పీఎం ఆరోపించారు. భారతీయ నిఘా సంస్థలు విదేశీయులకు సపోర్టు ఇస్తున్నాయని, ఆ విదేశీయులు భారత్‌కు ఐఈడీలు సరఫరా చేస్తున్నట్లు విదేశాంగ శాఖ మంత్రి పేర్కొన్నారు. ఒకవేళ భారత్ తమపై ఎలాంటి చర్యలకు దిగినా, దాన్ని ఎదుర్కొనేందుకు పాక్ సైనిక దళాలు సిద్ధంగా ఉన్నట్లు ఆయన చెప్పారు. పెహల్గామ్ ఉగ్రదాడిలో 26 మంది పర్యాటకులు మృతిచెందారు.