చైనాకు అన్ని విధాలా ముకుతాడు వేయడానికి భారత సైన్యం సర్వసన్నద్ధమవుతోంది. ఇప్పటికే వాతావరణం విషయంలో చైనాపై భారత సైన్యం ఆధిపత్యం సాధించింది. సరిహద్దుల్లో వుండే చలిని తట్టుకోలేక చైనా సైనికులు తోకముడిచిన విషయం తెలిసిందే. ఇక.. చైనాను అడ్డుకోడానికి భారత సైన్యం చైనా భాషపై కన్నేసింది. భారత్- చైనా సరిహద్దుల్లో విధులు నిర్వర్తించే సైనికులకు చైనా భాషను నేర్పనున్నారు. ఆ భాషపై పూర్తి సాధికారత పెంచుకోవాలని సైనికులకు ఉన్నతాధికారులు స్పష్టం చేస్తున్నారు. లద్దాఖ్‌లో భారత్- చైనా అధికారుల మధ్య ఘర్షణ జరిగిన తర్వాత భారత సైన్యం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
కొన్ని రోజుల క్రితం భారత ఆర్మీ చీఫ్‌కు ఉన్నతాధికారులు ఓ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఇందులోనే చైనా భాష గురించి ఓ ప్రజెంటేషన్ ఇచ్చినట్లు తెలుస్తోంది.వివిధ విశ్వవిద్యాలయాలు, విద్యా సంస్థల్లో కూడా చైనా భాషను బోధించి, చైనా భాషను అర్థం చేసుకునే వారి సంఖ్య, అలాగే బోధించే వారి సంఖ్యను కూడా పెంచాలన్న యోచనలో భారత ఆర్మీ అధికారులు ఉన్నారు.