చెన్నై: పదహారేండ్ల లోపు బాలలు సామాజిక మాధ్యమాలను వాడకుండా ఆస్ట్రేలియా ప్రభుత్వం నిషేధం విధించిందని, అటువంటి చట్టాన్ని మన దేశంలో కూడా తేవడం గురించి ఆలోచించాలని కేంద్ర ప్రభుత్వానికి మద్రాస్ హైకోర్టు సలహా ఇచ్చింది. ఇటువంటి చట్టం అమల్లోకి వచ్చే వరకు బాలలకు అవగాహన కల్పించేందుకు ప్రచారాన్ని వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించింది. హైకోర్టు మధురై ధర్మాసనం ఈ ఆదేశాలు ఇచ్చింది.
సామాజిక మాధ్యమాల్లో పోర్నోగ్రఫిక్ కంటెంట్ బాలలకు సులువుగా అందుబాటులో ఉంటున్నదని ఆరోపిస్తూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్)పై ధర్మాసనం విచారణ జరిపింది. ఆస్ట్రేలియా ఈ చట్టాన్ని డిసెంబర్ 10న తీసుకొచ్చినట్లు ఈ పిల్ తెలిపింది. మొబైల్ ఫోన్లో ‘పేరెంటల్ విండోస్’ను పెట్టడం వల్ల బాలలకు పోర్నోగ్రఫిక్ కంటెంట్ అందుబాటులో ఉండటాన్ని నియంత్రించవచ్చునని పేర్కొంది.