Pakistan Drugs : పాకిస్థాన్ (Pakisthan) నుంచి భారత్ (India) లోకి డ్రగ్స్ (Drugs) ను అక్రమంగా తరలిస్తున్న ముఠా పోలీసులకు పట్టుబడింది. విశ్వసనీయ సమాచారం మేరకు పంజాబ్ పోలీసులు నిఘా వేసి ముఠాను అదుపులోకి తీసుకున్నారు. కుట్రను భగ్నం చేశారు. వాళ్ల నుంచి భారీగా డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఏకంగా 85 కిలోల డ్రగ్స్‌ను పోలీసులు సీజ్ చేశారు.
అంతర్జాతీయ మార్కెట్లో ఈ డ్రగ్స్ విలువ వందల కోట్లలో ఉంటుందని అంచనా వేస్తున్నారు. అమృత్‌సర్‌కు చెందిన అమర్‌జోత్ సింగ్ జోతా సంధూను ఈ కుట్రలో ప్రధాన నిందితుడిగా గుర్తించి అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ పాకిస్థాన్ స్మగ్లింగ్ ముఠాను యూకే నుంచి లల్లీ అనే వ్యక్తి నడిపిస్తున్నాడని చెప్పారు. అమర్‌జోత్ నివాసం డ్రగ్స్ సరఫరాకు ప్రధాన కేంద్రంగా మారిందని పోలీసులు వెల్లడించారు.
పాకిస్థాన్ నుంచి వచ్చిన మాదక ద్రవ్యాలను అతడే దేశంలోని వివిధ ప్రాంతాలకు సరఫరా చేస్తున్నాడని తెలిపారు. పాకిస్థాన్‌లోని ఐఎస్ఐ ఏజెంట్లతోనూ ఈ ముఠాకు సంబంధాలు ఉన్నాయని అన్నారు. ముఠా నుంచి మరిన్ని విషయాలు రాబట్టేందుకు దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు.