Smuggler Jubair : ఈ నెల 16 నీట్ అభ్యర్థిని దారుణంగా హత్య చేసిన స్మగ్లర్ జుబైర్ (Smuggler Jubair).. శనివారం పోలీసుల కాల్పుల్లో హతమయ్యాడు. ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh) లోని గోరఖ్‌పుర్ (Ghorakpur) జిల్లాలో ఈ నెల 16న నీట్ అభ్యర్థి దీపక్ గుప్తా (Deepak Gupta) దారుణ హత్యకు గురయ్యాడు. పశువులను స్మగ్లింగ్ చేసే జుబైర్ అతడిని హత్య చేశాడు.
వివరాల్లోకి వెళ్తే.. కొత్వాలి ప్రాంతానికి చెందిన జుబైర్ అలియాస్ కాలియా పశువులను అక్రమంగా రవాణా చేస్తుంటాడు. అతడిపై ప్రభుత్వం రూ.లక్ష రివార్డు కూడా ప్రకటించింది. ఈ క్రమంలో ఈ నెల 16న కూడా గోరఖ్‌పూర్‌లో జుబైర్ పశువులను దొంగిలించేందుకు ప్రయత్నించాడు. అది గమనించిన నీట్ అభ్యర్థి దీపక్ గుప్తా (19) అతడిని అడ్డుకున్నాడు. దాంతో జుబైర్ అక్కడికక్కడే దీపక్‌ను చంపేశాడు.
ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు జుబైర్ కోసం గాలింపు చేపట్టారు. శుక్రవారం రాత్రి రాంపూర్ జిల్లాలో జుబైర్ మోటారు సైకిల్‌పై వెళ్తూ కన్పించాడు. పోలీసులు అతడిని పట్టుకునేందుకు ప్రయత్నించగా.. వారిపై కాల్పులు జరపడంతో ఇద్దరు అధికారులు గాయపడ్డారు. ఈ క్రమంలోనే పోలీసులు జరిపిన కాల్పుల్లో జుబైర్ తీవ్రంగా గాయపడ్డాడు. అతడిని ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతిచెందాడు.
జుబైర్‌పై రాంపూర్, బలరాంపూర్, గోండా, గోరఖ్‌పూర్‌లలో పలు గోవధ అభియోగాలతోపాటు మొత్తం 18 కేసులు ఉన్నాయని పోలీసులు తెలిపారు.