న్యూఢిల్లీ: కేంద్రంలో అధికారం చెలాయిస్తున్న నరేంద్రమోదీ నేతృత్వంలోని బీజేపీ సర్కారుకు.. కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ ఆర్థికమంత్రి పీ చిదంబరం చురకలు అంటించారు. దేశంలో ఆర్థిక పరిస్థితిని చక్కదిద్దడంలో కేంద్ర ప్రభుత్వ వైఫల్యాన్ని ఆయన ఎత్తిచూపారు. ధరల పెరుగుదలపై మోదీ సర్కారు సింపుల్గా కుంటిసాకులు చెబుతున్నదని విమర్శించారు.
ప్రభుత్వం ఎలాంటి దిద్దుబాటు చర్యలు చేపట్టకుండా ఇలాగే ఉంటే పరిస్థితి మరింత దిగజారే ప్రమాదం ఉన్నదని చిదంబరం హెచ్చరించారు. దేశ ఆర్థిక పరిస్థితి గురించి అందరూ ఆందోళన వ్యక్తం చేస్తుంటే.. కేవలం కేంద్ర ప్రభుత్వం మాత్రమే సంతోషంగా ఉన్నదని ఎద్దేవా చేశారు. రూపాయి పతనానికి, ధరల పెరుగుదలకు, వృద్ధి మందగించడానికి కేంద్రం ఉక్రెయిన్ యుద్ధాన్ని సాకుగా చూపుతున్నదని, ఇది ప్రభుత్వం చేతులు ఎత్తేసిందనడానికి నిదర్శనమని అన్నారు.
కేంద్రం తలుచుకుంటే దేశ ఆర్థిక పరిస్థితి నూటికి నూరుపాళ్లు మెరుగుపడుతుందని తాను చెప్పడంలేదని, అయితే అవసరమైన దిద్దుబాటు చర్యలు చేపట్టాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉన్నదని చెప్పారు. దేశంలో ద్రవ్యోల్బణం అదుపులో ఉండాలంటే మనం అప్రమత్తంగా ఉండాలి. కానీ ప్రభుత్వం నిద్రపోతున్నది. ఇకనైనా ప్రభుత్వం నిద్రలేవాలి. కళ్లు తెరిచి కాఫీ వాసన చూడాలి అంటూ చురకలు వేశారు.