న్యూఢిల్లీ: కేంద్ర బడ్జెట్ 2024-25పై సంయుక్త కిసాన్ మోర్చా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. వ్యవసాయాన్ని కార్పొరేటీకరణ చేయడానికి ఈ బడ్జెట్ బాటలు పరుస్తున్నదని మండిపడింది. రద్దయిన మూడు సాగు చట్టాలకు దొడ్డి దారిలో ప్రవేశం కల్పిస్తున్నదని ఆరోపించింది.
ఎస్కేఎం నేతలు బుధవారం వర్చువల్ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో మాట్లాడుతూ కొత్త బడ్జెట్లో రైతుల స్థితిగతులను మెరుగుపరచే నిబంధనలేవీ లేవన్నారు. భారతీయ కిసాన్ యూనియన్ నేత రాకేశ్ టికాయిత్ మాట్లాడుతూ, ఈ బడ్జెట్లో రైతుల కోసం ఏమీ లేదన్నారు. గత ఏడాది బడ్జెట్ మాదిరిగానే ఇది కూడా ఉందని దుయ్యబట్టారు.
బీహార్‌కు ఆర్థిక ప్యాకేజీ ఇచ్చినప్పటికీ, వ్యవసాయ రంగాన్ని పట్టించుకోలేదని ఆరోపించారు. ఆలిండియా కిసాన్ మహా సభ నేత అశిష్ మిట్టల్ మాట్లాడుతూ, ప్రకృతి వ్యవసాయం వల్ల ఉత్పత్తి తగ్గిపోతుందని అంటూ శ్రీలంక పరిస్థితిని గుర్తు చేశారు. జై కిసాన్ ఆందోళన్ నేత అవిక్ సాహా మాట్లాడుతూ, సాగు చట్టాలకు దొడ్డి దారి ప్రవేశం కల్పించేందుకు ఈ బడ్జెట్ ప్రయత్నిస్తున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు.