కొత్తగూడెం క్రైం, డిసెంబర్ 20 : కొన్ని రోజులుగా ఛత్తీస్గఢ్ దండకారణ్యం మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో భద్రతా బలగాలు, మావోయిస్టులకు మధ్య భీకర పోరు కొనసాగుతున్నది. బుధవారం జవాన్లకు, మావోయిస్టులకు మధ్య జరిగిన కాల్పుల్లో ఆరుగురు మావోయిస్టులు మృతిచెందినట్లు తెలిసింది. సుక్మా జిల్లా చింతల్నార్ పోలీస్స్టేషన్ పరిధిలోని నాగారం- కొత్తపల్లి అటవీ ప్రాంతంలో మావోయిస్టులు క్యాంపు నిర్వహించారనే విశ్వసనీయ సమాచారం మేరకు భద్రతా బలగాలు సెర్చింగ్ ఆపరేషన్ చేపట్టాయి. ఈ క్రమంలో బుధవారం ఉదయం నాగారం-కొత్తపల్లి అడవుల్లో మావోయిస్టులు తారసపడి జవాన్లపై కాల్పులు జరిపారు. అప్రమత్తమైన జవాన్లు ఎదురుకాల్పులు ప్రారంభించారు. ఇరువర్గాల మధ్య సుమారు గంటన్నరపాటు భీకర యుద్ధం జరిగింది. ఈ ఘటనలో సుమారు ఆరుగురు మావోయిస్టులు మృతి చెందినట్టు పోలీస్ అధికారులు తెలిపారు. ఘటనా స్థలంలో మావోయిస్టుల క్యాంపుని ధ్వంసం చేసి, భారీగా పేలుడు పదార్థాలు, ఆయుధ, వస్తు సామగ్రిని జవాన్లు స్వాధీనపరుచుకున్నట్టు సమాచారం.