సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శిగా సీతారాం ఏచూరి తిరిగి ఎన్నికయ్యారు. ఇలా వరుసగా ఎన్నిక కావడం ఇది మూడోసారి. కన్నూర్ వేదికగా పార్టీ 23 వ జాతీయ ప్లీనరీ సమావేశాలు జరిగాయి. ఈ సమావేశాల్లోనే పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఏచూరి తిరిగి ఎన్నికయ్యారు. అలాగే 17 మంది పొలిట్‌బ్యూరో సభ్యులు, 85 సెంట్రల్ కమిటీ సభ్యులను కూడా ఎన్నుకున్నారు. అయితే తొలిసారిగా పొలిట్ బ్యూరోలోకి ఓ దళిత నేతను తీసుకున్నారు. విజయ రాఘవన్, అశోక్ ధావలే, రామచంద్ర డోమే.. ఈ ముగ్గుర్ని పొలిట్ బ్యూరోలోకి కొత్తగా తీసుకున్నారు. ఇక.. రామచంద్రన్ పిళ్లై, బిమన్ బోస్, హన్నన్ మొల్హా… వీరు ముగ్గుర్ని పొలిట్ బ్యూరో నుంచి తొలగించి, సెంట్రల్ కమిటీకి ప్రత్యేక ఆహ్వానితులుగా ప్రకటించింది.
2015 విశాఖ వేదికగా పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశాలు జరిగాయి. ఆ సమావేశంలో పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా సీతారాం ఏచూరీ పేరును పార్టీ ప్రకటించింది. అంతకు పూర్వం 2005 నుంచి 2015 వరకూ పార్టీ ప్రధాన కార్యదర్శిగా ప్రకాశ్ కారత్ బాధ్యతలు నిర్వర్తించారు. కారత్ చేతుల్లోంచి ఏచూరీ చేతుల్లోకి పగ్గాలు వచ్చాయి. ఇక.. 2018 లో హైదరాబాద్ వేదికగా జాతీయ సమావేశాలు జరగ్గా… ఈ సమావేశాల వేదికగానే ఏచూరీని రెండోసారి కూడా పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఎన్నుకుంది. తాజాగా… 23 వ జాతీయ కార్యవర్గ సమావేశాలు కన్నూర్ వేదికగా జరిగాయి. ఈ సమావేశంలో ఏచూరీ తిరిగి మూడోసారి పార్టీ పగ్గాలు చేపట్టారు.