న్యూఢిల్లీ: అయోధ్యలో రామ మందిరం మాదిరిగానే బీహార్లోని సీతామండీ జిల్లాలో సీతమ్మకు భవ్యమైన ఆలయం నిర్మితం కానున్నది. ఇందుకు అవసరమైన ప్రణాళికలు వేగంగా సాగుతున్నాయి. సీతామండీని సీత జన్మస్థలంగా భావిస్తారు. అక్కడ కొత్త ఆలయాన్ని నిర్మించడం కోసం ఇప్పుడున్న ఆలయం చుట్టూ 50 ఎకరాలు సేకరించాలని బీహార్ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ప్రాథమికంగా నిర్ణయించింది. ఆలయ నిర్మాణాన్ని ప్రభుత్వం కాకుండా.. అయోధ్య ట్రస్టులాగానే ఒక పబ్లిక్ ట్రస్టు నిర్మించనున్నదని, ఆ ట్రస్టే విరాళాలు సేకరిస్తుందని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. మాజీ ఎమ్మెల్సీ కామేశ్వర్ చౌపాల్ మాట్లాడుతూ సీతామండీలో 100 ఏండ్ల క్రితం నిర్మితమైన ఒక ఆలయం ఉన్నదని, అది చాలా పాతపడిపోయిందని తెలిపారు. కొత్త ఆలయ నిర్మాణ వివరాలు త్వరలో వెల్లడిస్తామని తెలిపారు.