పంజాబ్ స్వర్ణ దేవాలయంలో జరిగిన ఘటన విషయంలో అక్కడి ప్రభుత్వం అలర్ట్ అయ్యింది. స్వర్ణ మందిరంలో జరిగిన ఘటనపై సిట్‌ను ఏర్పాటు చేసినట్లు డిప్యూటీ సీఎం సుఖ్జీందర్ సింగ్ ప్రకటించారు. అమృత్సర్ డిప్యూటీ కమిషనర్ (శాంతి భద్రతలు) ఈ సిట్‌కు సారథ్యం వహిస్తారు. రెండు రోజుల్లోగా సిట్ ప్రభుత్వానికి తన నివేదికను సమర్పిస్తుందని ఆయన పేర్కొన్నారు. ఈ విషయంపై సిట్ ఆమూలాగ్రం దర్యాప్తు చేస్తుందని డిప్యూటీ సీశ్రీం సుఖ్జీందర్ సింగ్ తెలిపారు.
పంజాబ్‌లోని అమృత్సర్ స్వర్ణదేవాలయంలోకి శనివారం ఆగంతకుడు చొరబడ్డాడు. సిక్కులు ఎంతో పవిత్రంగా భావించే గురుగ్రంథ్ సాహిబ్‌ను అపవిత్రం చేసేందుకు ప్రయత్నించాడు. దీంతో కోపోద్రిక్తులైన భక్తులు అతడిపై దాడి చేశారు. తీవ్రగాయాలపాలైన అతడు ప్రాణాలు కోల్పోయాడు. పోలీసుల వివరాల ప్రకారం.. శనివారం సాయంత్రం ప్రార్థనల సమయంలో ఆలయం లోపలికి ఓ వ్యక్తి వెళ్లాడు. బంగారు గ్రిల్స్ దాటి, ఖడ్గాన్ని పట్టుకుని, పూజారి గురుగ్రంథ్ సాహిబ్‌ను పఠిస్తున్న ప్రాంతానికి చేరుకున్నాడు. వెంటనే అప్రమత్తమైన శిరోమణి గురుద్వార ప్రబంధక్ కమిటీ సిబ్బంది అతడిని అదుపులోకి తీసుకున్నారు.
ఎస్జీపీసీ కార్యాలయానికి తీసుకెళ్తుండగా, అప్పటికే ఆగ్రహంతో ఉన్న భక్తులు అతడిపై దాడి చేశారు. ఆ వ్యక్తి ఉత్తరప్రదేశ్‌కు చెందిన వాడని, 30 ఏండ్ల వయసు ఉంటుందని పోలీసులు తెలిపారు. ఘటన ఎలా జరిగిందన్న దానిపై సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నామని చెప్పారు. గురుగ్రంథ్ సాహిబ్‌ను అపవిత్రం చేసేందుకు యత్నించడాన్ని శిరోమణి గురుద్వార ప్రబంధక్ కమిటీ ఎగ్జిక్యూటివ్ సభ్యుడు భాయి గురుప్రీత్ సింగ్ తీవ్రంగా ఖండించారు.