మంగుళూరు: కర్నాటకలోని ధర్మస్థలి(Dharmasthala)లో గత రెండు దశాబ్ధాలుగా వందల సంఖ్య రేప్‌లు, మర్డర్లు జరిగాయని, వాళ్ల మృతదేహాలను పలు ప్రదేశాల్లో పాతి పెట్టినట్లు ఫిర్యాదు ఇచ్చిన వ్యక్తిని ఇవాళ పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసులో విచారణ చేపడుతున్న సిట్ బృందం విచారణ నిమిత్తం అతన్ని అదుపులోకి తీసుకున్నది. స్పెషనల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ చీఫ్ ప్రణబ్ మోహంతి ఆ ఫిర్యాదు ఇచ్చిన వ్యక్తిని ప్రశ్నిస్తున్నారు. ఫిర్యాదుదారుడి పేరును అధికారులు వెల్లడించలేదు. అతను ఇచ్చిన ఫిర్యాదులోని అంశాలు, డాక్యుమెంట్లకు పొంతన లేదని, అందుకే అతన్ని అరెస్టు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ కేసులో సిట్ బృందం తన దర్యాప్తు కొనసాగిస్తున్నది.
అరెస్టు చేసిన వ్యక్తికి చెందిన ఓ మహిళ మీడియాతో మాట్లాడింది. ఫిర్యాదు ఇచ్చిన వ్యక్తి తన భర్త అని ఆమె పేర్కొన్నది. అయితే తన భర్త మంచివాడు కాదు అని, తనను, తన పిల్లలను వేధించేవాడు అని చెప్పిందామె. ధర్మస్థలపై అతను ఇచ్చిన ఫిర్యాదు నిజం కాదు అని ఆమె పేర్కొన్నది. డబ్బు కోసం అతను అలా చెప్పి ఉంటాడని వెల్లడించింది. 1999లో అతన్ని పెళ్లి చేసుకున్నానని, ఏడేళ్లు కాపురం చేశామని, తనను అతను కొట్టేవాడని, ఓ కుమార్తె, కొడుకు ఉన్నారని, ధర్మస్థలి ఆలయంలో అతను టాయిలెట్ స్వీపర్‌గా పనిచేసినట్లు ఆమె తెలిపింది.