datia rape| భోపాల్: మధ్యప్రదేశ్లో అధికార బీజేపీ నాయకుడి కుమారుడు ఘాతుకానికి పాల్పడ్డాడు. మరో ముగ్గురితో కలిసి యువతిపై సామూహిక అత్యాచారానికి తెగబడ్డాడు. మైనర్ అయిన ఆమె సోదరిపైనా లైంగికదాడికి పాల్పడ్డారు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన బాధితురాలు ఆత్మహత్యకు యత్నించింది. దతియా జిల్లాలో ఈ దారుణం చోటుచేసుకుంది. నిందితుల్లో బీజేపీ ఆఫీస్ బేరర్ కుమారుడు (మైనర్) కూడా ఉన్నాడు. ఘటనపై తీవ్ర ఆగ్రహానికి గురైన బాధితురాలి బంధువులు, స్థానికులు పోలీస్ స్టేషన్ను ముట్టడించారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
బాధితురాలి సోదరి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ఓ యువకుడితోపాటు ఇద్దరు మైనర్లను అరెస్ట్ చేశారు. మరొకరి కోసం గాలిస్తున్నారు. ‘గురువారం మధ్యాహ్నం నలుగురు వ్యక్తులు మమ్మల్ని కిడ్నాప్ చేశారు. అనంతరం ఓ ఇంటికి తీసుకెళ్లారు. నా సోదరిపై గ్యాంగ్రేప్నకు పాల్పడ్డారు. నా పైనా లైంగికదాడి చేశారు’ అని బాలిక తన ఫిర్యాదులో పేర్కొన్నట్టు పోలీసులు తెలిపారు. అనంతరం అక్కడి నుంచి ఇంటికి చేరుకోగా, బాధితురాలు ఆత్మహత్యకు యత్నించిందని చెప్పారు. ఆమె ప్రస్తుతం దవాఖానలో చికిత్స పొందుతున్నదని తెలిపారు. ఇప్పటికే ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నామని, మరో నిందితుడి ఆచూకీ కోసం రూ.10 వేల రివార్డు ప్రకటించామన్నారు.