న్యూఢిల్లీ, నవంబర్ 22: ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ(సర్) కోసం 12 రాష్ర్టాలు, కేంద్ర పాలిత ప్రాంతాలలో ప్రస్తుతం కొనసాగుతున్న ఓటర్ల ధ్రువీకరణ ప్రక్రియ కారణంగా గడచిన నెల రోజుల్లో అనేక రాష్ర్టాలలో ఆత్మహత్యలు, తీవ్ర వేధింపులు జరుగుతున్న సంఘటనలు వెలుగుచూస్తున్నాయి. ఓటర్ల జాబితాలలో మార్పులు చేర్పుల ద్వారా వాటి ప్రక్షాళన చేయడమే సర్ ఉద్దేశమని ఎన్నికల కమిషన్ వాదిస్తున్నప్పటికీ క్షేత్రస్థాయిలో సర్ అమలు కోసం ఉపయోగిస్తున్న పద్ధతుల కారణంగా ప్రభుత్వ ఉద్యోగులు, పౌరుల మరణాలు సంభవించడం తీవ్ర ఆందోళనకు దారి తీస్తోంది.
సర్ కార్యక్రమంలో భాగంగా ఇంటింటినీ సందర్శించి ఓటర్లను తనిఖీ చేయడం, వివరాలు సేకరించడం, ఓటరు రికార్డులను డిజిటలైజ్ చేయడం వంటివి వీటిని క్షేత్ర స్థాయిలో నిర్వహించే బూత్ స్థాయి ఆఫీసర్లకు(బీఎల్వో) తలకు మించిన భారంగా మారి తీవ్ర ఒత్తిడికి గురి చేస్తున్నట్లు ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి.ఆచరణాత్మకం కాని లక్ష్యాలను విధించి బీఎల్వోలపై అమానుషంగా ఒత్తిడి పెడుతున్నారని ఉద్యోగ సంఘాల నాయకులు, రాజకీయ పార్టీల నాయకులు మండిపడుతున్నారు.
దీనికి తోడు జాతీయ పౌరుల పట్టిక(ఎన్ఆర్సీ) చుట్టూ అనేక అనుమానాలు, ఆందోళనలు అలుముకోవడంతో పౌరులలో కూడా తమ ఓటు హక్కు పై అనేక భయాందోళనలు ఏర్పడుతున్నాయి. ప్రస్తుతం సర్ జరుగుతున్న పశ్చిమ బెంగాల్, రాజస్థాన్, కేరళలో అధికారుల వేధింపులతో బీఎల్వోలు బలవనర్మరణాలకు పాల్పడడం సంచలనం సృష్టిస్తోంది. ఓటర్ల నమోదు ప్రక్రియ మొదలైనప్పటి నుంచి పశ్చిమ బెంగాల్లో అత్యధిక ఆత్మహత్యలు చోటుచేసుకున్నాయి.
పశ్చిమ బెంగాల్‌లోని నదియా జిల్లాకు చెందిన ఉపాధ్యాయురాలైన రింకు తరఫ్దార్(54) బీఎల్వోగా పని చేస్తున్నారు. సర్ పనుల ఒత్తిడి తట్టుకోలేక శనివారం ఆమె కృష్ణా నగర్‌లోని తన నివాసంలో ఉరేసుకొన్నారు. అంతకుముందు నవంబర్ 9న పూర్వ బర్ధమాన్‌లో నమితా హన్స్దర్ అనే బీఎల్ఓ బ్రెయిన్ స్ట్రోక్‌కు గురై మరణించారు. పశ్చిమ బెంగాల్లో బీఎల్వోలు తమ పైఅధికారుల నుంచి ఒత్తిడి ఎదుర్కొంటుంటే సర్ ప్రక్రియలో పాత రికార్డుల పరిశీలన ఉండడంతో పౌరులలో ఎన్ఆర్సీకి సంబంధించిన భయాందోళనలు చెలరేగి వారు కూడా ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు!
మరోవైపు సర్ టార్గెట్లను డెడ్‌లైన్ లోపల(డిసెంబర్ 4) పూర్తి చేయకపోతే తీవ్ర పర్యవసానాలను ఎదుర్కోవలసి వస్తుందని పథనంతిట్ట జిల్లాలోని ఎన్నికల నమోదు అధికారి బీఎల్వోలను ఫోన్లో హెచ్చరించిన ఆడియో రికార్డింగ్‌ను చానెళ్లు ప్రసారం చేయడం సంచలనం సృష్టించింది. కేరళ కార్మిక సంఘాలు నవంబర్ 17న రాష్ట్రవ్యాప్తంగా సర్ విధులను బహిష్కరించాయి.