Siddaramaiah : కర్ణాటక ముఖ్యమంత్రి (Karanataka CM) సిద్ధరామయ్య (Siddaramaiah) కారుపై ఉన్న ట్రాఫిక్ చలానాలను డిస్కౌంట్ స్కీమ్ ఉపయోగించుకుని కట్టేశారు. ట్రాఫిక్ చలానాలపై వాహనదారులకు ఊరట కల్పిస్తూ కర్ణాటక ప్రభుత్వం (Karnataka govt) ఇటీవల 50 శాతం డిస్కౌంట్ ప్రకటించింది. ఈ క్రమంలో సీఎం సిద్ధరామయ్య కారుపై ఉన్న చలానాలను ఈ రాయితీ ఉపయోగించుకుని కట్టేశారు.
సీఎం సిద్ధరామయ్య కారుపై మొత్తం ఏడు చలానాలు నమోదయ్యాయి. వాటిలో సీటు బెల్ట్ ధరించనందుకు ఆరు, అతివేగానికి సంబంధించి ఒక చలానా ఉన్నాయి. దాంతో ఇటీవల సీఎం కారుపై చలానాలు ఉన్నా చెల్లించడం లేదని సామాజిక మాధ్యమాల్లో తీవ్ర చర్చ నడిచింది. ఈ నేపథ్యంలో తాజాగా సీఎం యంత్రాంగం డిస్కౌంట్ పథకాన్ని ఉపయోగించుకుంది. ఈ చలానాలకుగానూ రాయితీపోగా మిగిలిన రూ.8,750 చెల్లించింది.
కర్ణాటక ప్రభుత్వం ట్రాఫిక్ చలానాలపై 50 శాతం డిస్కౌంట్ స్కీమ్‌ను ఆగస్టు 21న ప్రారంభించింది. సెప్టెంబర్ 19 వరకు ఈ స్కీమ్ అమల్లో ఉండనుంది. ఈ రాయితీ పథకంతో ఇప్పటివరకు రూ.40 కోట్లు వసూలైనట్లు రాష్ట్ర ప్రభుత్వ అధికారులు తెలిపారు.