బెంగళూర్ : కర్నాటక అసెంబ్లీ ఎన్నికల (Karnataka Assembly Elections)కు ప్రధాన పార్టీలు ఎన్నికల ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి. ప్రత్యర్ధులపై మాటల తూటాలు ప్రయోగిస్తుండటంతో ప్రచార పర్వం ఊపందుకుంది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఇప్పటికే పలు ప్రచార ర్యాలీల్లో పాల్గొని కాషాయ పార్టీపై విమర్శలు గుప్పించారు. మైసూర్ జిల్లా వరుణలో జరిగిన ర్యాలీలో కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ సీఎం సిద్ధరామయ్య కాషాయ పార్టీపై విమర్శలు గుప్పించారు.
అవినీతి సర్కార్ను సాగనంపి కాంగ్రెస్కు అధికార పగ్గాలు అప్పగించాలని ఆయన ఓటర్లను కోరారు. ఈ ఎన్నికల తర్వాత తాను ఎన్నికల రాజకీయాలకు దూరమవుతానని సిద్ధరామయ్య పునరుద్ఘాటించారు. తనకు ఇవే చివరి ఎన్నికలని స్పష్టం చేశారు. మరోవైపు బీజేపీని వీడి ఇటీవల కాంగ్రెస్లో చేరిన మాజీ సీఎం జగదీష్ శెట్టార్ హుబ్లీ-ధార్వాడ్ సెంట్రల్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి నామినేషన్ దాఖలు చేశారు. ఈ నియోజకవర్గం నుంచి తాను భారీ మెజారిటీతో విజయం సాధిస్తానని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
ఈ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్ధి మహేష్ టెంగిన్కైతో ఆయన తలపడుతున్నారు. కర్నాటక అసెంబ్లీ ఎన్నికల్లో పాలక బీజేపీని మట్టికరిపించి పాలనా పగ్గాలు చేపట్టాలని కాంగ్రెస్ సర్వశక్తులు ఒడ్డుతుండగా అధికారం నిలుపుకునేందుకు కాషాయ పార్టీ చెమటోడుస్తోంది. ఇక గణనీయ సంఖ్యలో సీట్లు సాధించి సత్తా చాటాలని జేడీఎస్ ఉవ్విళ్లూరుతోంది. మే 10న కర్నాటక అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుండగా 13న ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలు ప్రకటిస్తారు.
Read More