మైసూరు : ఆర్సీబీ క్రికెట్ జట్టుకు సన్మానం జరిగిన విధాన సౌధ వద్ద తొక్కిసలాట జరగలేదని, చిన్నస్వామి స్టేడియం సమీపంలో జరిగిందని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య స్పష్టం చేశారు. ఆదివారం మైసూరులో ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఆ ఘటనతో తనకు ఎలాంటి సంబంధం లేదని తెలిపారు. తాము ఎటువంటి తప్పు చేయనపుడు ఇబ్బంది పడే ప్రశ్నే రాదని ఆయన చెప్పారు. అటువంటి సంఘటన జరగకూడదనే తాము అంటున్నామని, అధికారుల బాధ్యతారాహిత్యం వల్ల ఆ సంఘటన జరిగిందని ఆయన వ్యాఖ్యానించారు. ‘నేను బాధ పడుతున్నాను.
యావత్ ప్రభుత్వం బాధ పడుతోంది. తొక్కిసలాటలోమొదటి మరణం సాయంత్రం 3.50 గంటలకు జరిగింది. కాని సాయంత్రం 5.45 గంటలకు నాకు సమాచారం అందింది’ అని సిద్ధరామయ్య వెల్లడించారు. చిన్నస్వామి స్టేడియం సమీపంలో భద్రతా ఏర్పాట్ల గురించి నగర పోలీసు కమిషనర్ తనకు ఎటువంటి సమాచారం ఇవ్వలేదని ఆయన తెలిపారు. ఈ కారణంగానే సీనియర్ పోలీసు అధికారులపై చర్యలు చేపట్టామని ఆయన చెప్పారు.