Siddaramaiah : తనపై కొందరు వ్యక్తులు దాడికి పాల్పడ్డారంటూ భారత వైమానిక దళం (Indian Airforce officer) కు చెందిన వింగ్ కమాండర్ (Wing commander) చేసిన ఆరోపణల్లో నిజం లేదని తేలింది. ఈ కేసు దర్యాప్తు చేస్తున్న పోలీసులు.. ఫుట్‌పాత్‌పై నిల్చుని ఉన్న వికాస్ కుమార్ అనే వ్యక్తిపై తొలుత బోసే దాడికి దిగినట్లు తెలిపారు. ఈ మేరకు ఒక వీడియో రిలీజ్ చేశారు.
దీనిపై కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య (Siddaramaiah) స్పందించారు. అధికారి నిరాధార ఆరోపణలు చేయడం సరైన చర్య కాదని అన్నారు. భాష విషయంలో ఇతరులపై దాడి చేసే స్వభావం తమకు లేదన్నారు. దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి ఎందరో ప్రజలు తమ రాష్ట్రంలో స్థిరపడ్డారని, వారిని తాము గౌరవంగానే చూస్తామని చెప్పారు. తప్పెవరిది అయినా నిందితులపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని అన్నారు.
ఈ విధంగా నిరాధార ఆరోపణలు చేస్తూ భాషా వివాదాలను సృష్టిస్తే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. వీడియోలో రికార్డ్ అయిన దృశ్యాల ఆధారంగా కమాండర్‌పై వికాస్ హత్యాయత్నం కేసు నమోదు చేశారు. దీనిపై పోలీసులు బోస్‌ను త్వరలోనే విచారించనున్నారు. కాగా సోమవారం డీఆర్డీఓకు చెందిన అధికారి బోస్ ఒక వీడియోను విడుదల చేశారు. తమ కారుపై ఉన్న డీఆర్డీఓ స్టిక్కర్‌ను చూసి బెంగళూరులో కొందరు వ్యక్తులు తమ వాహనాన్ని అడ్డగించారని తెలిపారు.
కన్నడ భాషలో తమను దూషిస్తూ తనపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచారని ఆరోపించారు. ఫిర్యాదు చేద్దామని వెళ్తే అక్కడ ఎలాంటి స్పందనా రాలేదని, కర్ణాటకలో ఇలాంటి పరిస్థితులు చూస్తే ఆశ్చర్యంగా అనిపిస్తుందని వీడియోలో పేర్కొన్నారు. మరోవైపు బోసే తనపై దాడి చేశాడని వికాస్ అనే వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దాంతో సీసీ ఫుటేజ్‌ను పరిశీలించిన పోలీసులకు బోసే ముందుగా వికాస్‌పై దాడికి పాల్పడినట్లు తెలిసింది.