ముంబై: ఢిల్లీలో శ్రద్ధావాకర్ దారుణ హత్య ఘటనే తాను తునీషా శర్మకు బ్రేకప్ చెప్పేలా చేసిందని పోలీసుల ఇంటరాగేషన్లో తునీషా మృతి కేసు నిందితుడు షీజాన్ ఖాన్ చెప్పాడు. సహజీవనం చేస్తున్న వ్యక్తే శ్రద్ధను దారుణంగా హతమార్చి 35 ముక్కలుగా కోసిన ఘటన తనను కలచివేసిందని తెలిపాడు. అందుకే తాను బాగా ఆలోచించి తునీషాకు బ్రేకప్ చెప్పానని అన్నాడు.
తునీషాను ఆత్మహత్యకు పురికొల్పాడన్న ఆరోపణలపై వాలివ్ పోలీసులు ఆదివారం తెల్లవారుజామున షీజాన్ ఖాన్ను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం కోర్టులో హాజరుపర్చగా ముంబైలోని వాసాయ్ కోర్టు అతనికి నాలుగు రోజుల పోలీస్ కస్టడీ విధించింది. దాంతో తొలి రోజైన ఆదివారమే పోలీసులు షీజాన్ పలు విధాలుగా ప్రశ్నించారు.
ఈ సందర్భంగా షీజాన్ ఖాన్.. శ్రద్ధ వాకర్ హత్య ఘటనే తనను తునీషాకు దూరం జరిగేలా చేసిందని పోలీసులకు చెప్పాడు. మరో మూడు రోజులపాటు కూడా పోలీసులు షీజాన్ను ప్రశ్నించారు. మరోవైపు తునీషా, షీజాన్ మొబైల్ ఫోన్లలోని డాటా రికవరీ కోసం పోలీసులు వాటిని ఫోరెన్సిక్ ల్యాబోరేటరీకి పంపించారు. ఆ డాటా వెల్లడైతే వారి మధ్య ఏం జరిగిందనే సంగతి తేలనుంది.