న్యూఢిల్లీ: జేడీ(యూ) అధినేత, బీహార్ సీఎం నితీశ్ కుమార్, డీఎంకే ఎంపీ టీఆర్ బాలుపై అసహనం వ్యక్తం చేశారు. జాతీయ భాష అయిన హిందీ తెలిసి ఉండాలని సూచించారు. (Hindi Row) ప్రతిపక్షాల కూటమి ‘ఇండియా’ బ్లాక్ సమావేశం ఢిల్లీలో మంగళవారం జరిగింది. ఈ సందర్భంగా నితీశ్ కుమార్ మాట్లాడారు. అయితే ఆయన హిందీ ప్రసంగాన్ని డీఎంకే నేత టీఆర్ బాలు అర్ధం చేసుకోలేకపోయారు. ఈ నేపథ్యంలో దానిని అనువాదం చేయాలని ఎదురుగా కూర్చొన్న ఆర్జేడీ ఎంపీ మనోజ్ ఝాకు సైగ చేశారు.
కాగా, హిందీ ప్రసంగాన్ని అనువదించేందుకు నితీశ్ కుమార్ అనుమతిని మనోజ్ కోరారు. ఈ నేపథ్యంలో ఆయన అసహనం వ్యక్తం చేశారు. ‘మన దేశాన్ని హిందుస్థాన్ అని పిలుస్తాం. హిందీని మన జాతీయ భాష అని వ్యవహరిస్తాం. మనకు ఆ భాష తెలిసి ఉండాలి’ అని నితీశ్ అన్నారు. అలాగే తన హిందీ ప్రసంగాన్ని అనువదించవద్దని మనోజ్‌తో అన్నారు. మరోవైపు హిందీని తీవ్రంగా వ్యతిరేకించే డీఎంకే చీఫ్, తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ కూడా ఆ పార్టీ ఎంపీ టీఆర్ బాలుతో కలిసి ‘ఇండియా’ బ్లాక్ సమావేశంలో పాల్గొన్నారు.