Nagaland | న్యూఢిల్లీ: మనుషులలో పరస్పర విశ్వాసం సన్నగిల్లి అడుగడుగునా సీసీటీవీ కెమెరాలు ప్రత్యక్షమవుతున్న ఇప్పటి రోజుల్లో నమ్మకమే నగదుగా చేసుకుని వ్యాపారం సాగిస్తున్న ఓ అరుదైన వాతావరణాన్ని నాగాలాండ్‌లో చూడవచ్చు. అక్కడి ప్రకృతే కాదు మనుషులు కూడా చాలా అందమైన మనసు కలవారని నిరూపిస్తున్నారు. నాగాలాండ్‌లోని నాగా పర్వతాలపైన ఉన్న ఫుత్సేరో పట్టణ శివార్లలో గల కొన్ని దుకాణాల వద్ద విక్రయదారులు ఎవరూ కనిపించరు.
కస్టమర్లు తమకు నచ్చిన వస్తువులను తామే కొనుక్కుని దాని ధరను అక్కడ ఉన్న బాక్సులో వేయాల్సి ఉంటుంది. పండ్లు, కూరగాయలు, పచ్చళ్లు, జామ్‌లు, ఇతర నిత్యావసర వస్తువులను స్థానిక రైతులు అక్కడ దుకాణాలలో విక్రయిస్తారు. ప్రముఖ దర్శకుడు భరత్ బాలా ఇటీవల ఆ ప్రాంతాన్ని సందర్శించి మనుషుల పట్ల ఇంతగా నమ్మకాన్ని పెట్టుకుని వ్యాపారం చేసుకుంటున్న అక్కడి రైతులను చూసి ముగ్ధులయ్యారు.
నాగాలాండ్ రాజధాని కోహిమా నగరానికి రోడ్డు మార్గంలో రెండు గంటలపాటు ప్రయాణిస్తే ఫేక్ జిల్లాలోని ఫుత్సేరో పట్టణం కనిపిస్తుంది. నమ్మకం బలమేమిటో ఆ ప్రాంతాన్ని చూసిన తర్వాత తనకు అర్థమైందని, క్యాషియర్ లేని, సెక్యూరిటీ లేని ఆ దుకాణాలు నమ్మకమే నగదుగా చేసుకుని వ్యాపారం సాగించడం అద్భుతమని భరత్ బాలా అన్నారు. అక్కడి దుకాణాలను చూసిన తర్వాత మనుషులపై నమ్మకం ఉన్న చోట మోసానికి తావుండదన్న సత్యం తనకు బోధపడిందని ఆయన చెప్పారు. ఫుత్సేరోలోని మూడు ప్రదేశాలలో ఇటువంటివి దాదాపు 20 దుకాణాల వరకు ఉన్నాయి. ఈ దుకాణాలన్నిటినీ మహిళా రైతులు నిర్వహించడం విశేషం.
స్థానిక పొలాల్లో పండించే ఉత్పత్తులనే ఇక్కడ విక్రయిస్తారు. స్థానికంగా లభించే పండ్లతోనే జామ్‌లు తయారుచేసి ఈ దుకాణాలలో అమ్ముతున్నారు. నమ్మకం ఆధారంగా నడిచే దుకాణాలు కేవలం ఫుత్సేరోలో మాత్రమే కాదు మిజోరం, కేరళ స్కూళ్లలో కూడా ఇప్పుడు నడుస్తున్నాయి. పరస్పర అపనమ్మకంతో జీవించే నగరవాసులకు ఈ వాతావరణం వింతగా కనిపించవచ్చు కాని ఇక్కడి స్థానికులు మాత్రం నమ్మకమే తమ జీవన విధానంగా చేసుకున్నారు. ఈ షాపులలో నగదుతో పాటు యూపీఐ స్కానర్ ద్వారా కూడా తాము కొనుగోలు చేసిన వస్తువులకు కస్టమర్లు చెల్లింపులు జరిపే సౌకర్యం ఉండడం విశేషం.