ముంగెర్ (బీహార్), మే 22: తన ప్రేమను తిరస్కరించిందన్న కోపంతో ఒక కానిస్టేబుల్ ఓ పెండ్లి కూతురిపై తీవ్ర అఘాయిత్యానికి పాల్పడ్డాడు. బ్యూటీ పార్లర్లో ఉన్న ఆమెపై కాల్పులు జరిపి చంపడానికి ప్రయత్నించి, తానూ ఆత్మహత్య చేసుకోబోయాడు. ఈ సంఘటన బీహార్‌లోని ముంగెర్ పట్టణంలో ఆదివారం రాత్రి చోటు చేసుకున్నది. గాయపడ్డ బాధితురాలికి ప్రాణాపాయం లేదని పోలీసులు తెలిపారు. వారి కథనం ప్రకారం పాట్నాలో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న అమన్ కుమార్ ప్రేమను తారాపూర్ డయారాకు చెందిన అపూర్వ కుమారి (26) తిరస్కరించింది. ఆదివారం రాత్రి ఆమె వివాహం జరగాల్సి ఉండటంతో మేకప్ కోసం సాయంత్రం బ్యూటీ పార్లర్‌కు వచ్చింది. అక్కడి సిబ్బంది ఆమెకు మేకప్ చేస్తుండగా, అమన్ కుమార్ ఆమెపై కాల్పులు జరిపాడు. తర్వాత తనను కూడా కాల్చుకోబోయాడు. అయితే చేతులు వణకడంతో చేతిలోంచి పిస్తోలు జారిపోయింది. బాధితురాలిని వెంటనే దవాఖానకు తరలించారు. నిందితుడి కోసం గాలిస్తున్నారు.