(స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్, నవంబర్ 11 (నమస్తే తెలంగాణ): బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ నేతృత్వంలోని మహాఘట్బంధన్ కూటమికి భారీ షాక్ తగిలింది. మంగళవారం సాయంత్రం వెలువడిన అన్ని ఎగ్జిట్ పోల్స్‌లో నితీశ్ నేతృత్వంలోని ఎన్డీయే కూటమికే ప్రజలు మద్దతు ప్రకటించినట్టు తేలింది. ప్రభుత్వ ఏర్పాటుకు 122 స్థానాలు అవసరపడగా, ఎన్డీయే కూటమికి 147 వరకూ సీట్లు, మహాఘట్బంధన్ కూటమికి 90 సీట్లు మాత్రమే వచ్చే అవకాశం ఉన్నదని ఎగ్జిట్ పోల్స్ తేల్చి చెప్పాయి. 2020లో 110 సీట్లను గెలుచుకొన్న కాంగ్రెస్ కూటమికి ఇప్పుడు మరో 20 వరకూ సీట్లు తగ్గుతాయన్న అంచనాలు ప్రతిపక్షాలకు మింగుడుపడటంలేదు. ఇదే సమయంలో ప్రశాంత్ కిశోర్‌కు చెందిన జన్ సూరజ్ పార్టీ కూడా ఈ ఎన్నికల్లో ఏ మాత్రం ప్రభావం చూపలేకపోయింది.
