ముంబై: మహారాష్ట్రలో (Maharashtra) అధికార కూటమిని వరుస వివాదాలు చుట్టుముడుతున్నాయి. హిందీని తప్పనిచేస్తూ ఎన్డీఏ ప్రభుత్వం జారీచేసిన ఆదేశాలు వివాదాస్పదం అవడంతో వాటిని ఉపసంహరించుకున్న విషయం తెలిసిందే. శివసేన (షిండే) అధ్యక్షుడు లోక్‌నాథ్ షిండే గతవారం జై గుజరాత్ అనడంతో విపక్షాలకు టార్గెట్ అయ్యారు. దీంతో సీఎం ఫడ్నవీస్ వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది. తాజాగా ఆ పార్టీ ఎంపీ, కేంద్ర ఆరోగ్య శాఖ సహాయ మంత్రి ప్రతాప్ జాదవ్ చేసిన వ్యాఖ్యలు మరోసారి విపక్షాలకు అస్త్రాలుగా మారాయి. ముంబైని (Mumbai ) గుజరాత్ రాజధానిగా పేర్కొనడంతో ప్రతిపక్షాలు ఆయనపై ఫైర్ అవుతున్నాయి.
రెండు రోజుల క్రితం ధరాశివ్ జిల్లాలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న ప్రతాప్ జాదవ్.. షిండే వ్యాఖ్యలపై స్పందించారు. రాజకీయాల్లో ఇలాంటి అంశాలపై చర్చ అవసరం లేదు. గుజరాత్ మన పొరుగు రాష్ట్రం. అది పాకిస్థాన్‌లో లేదు. సంయుక్త మహారాష్ట్ర ఉద్యమం సమయంలో గుజరాత్ రాజధానిగా ముంబై ఉన్నది అని చెప్పారు.
దీంతో జాదవ్ వ్యాఖ్యలు మహారాష్ట్రలో మరోసారి రాజకీయ దుమారాన్ని సృష్టించాయి. శివసేన (యూబీటీ) ఎంపీ ప్రియాంక చతుర్వేది జాదత్ తీరును తప్పుబట్టారు. ఆయన కేంద్ర సహాయ మంత్రిగా ఉన్నారు. 50 పెట్టెల (Panaas Khoke) కోసం తన సొంత పార్టీ నాయకత్వాన్ని మోసం చేసిన వ్యక్తి. ఇతడు మహారాష్ట్రకు చెందిన జై గుజరాత్ పార్టీలో సభ్యుడు. తన యజమానులను సంతోషపెట్టేందుకు కొత్తగా చరిత్రను సృష్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
కాగా, గతవారం అమితా షా ముఖ్యఅతిథిగా హాజరైన ఓ సభలో పాల్గొన్న మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే.. ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రిని పొగడ్తలో ముంచెత్తారు. జై హింద్, జై మహారాష్ట్ర, జై గుజరాత్ అంటూ తన ప్రసంగాన్ని ముగించారు. దీనిపై విపక్షాలు మండిపడ్డాయి. షిండే అధికార దాహంతో ఉన్నారని ఆగ్రహం వ్యక్తం చేశాయి. అయితే షిండే వ్యాఖ్యలను సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ సమర్థించారు. జై గుజరాత్ అన్నంత మాత్రాన.. షిండే మహారాష్ట్ర కంటే గుజరాత్‌ను ఎక్కువగా ప్రేమిస్తున్నాడని కాదని చెప్పారు.