Sanjay Raut : పుణె, పింప్రి చించ్వాడ్ లోకల్ బాడీ ఎన్నికల నేపథ్యంలో మహారాష్ట్రలో పార్టీల మధ్య విమర్శలు, ప్రతి విమర్శలు మొదలయ్యాయి. మహారాష్ట్రలో బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న అజిత్‌పవార్.. పింప్రి చించ్వాడ్ మున్సిపల్ కార్పోరేషన్లో అవినీతి జరిగిందని శుక్రవారం ఆరోపించారు. అయితే ఆ మున్సిపల్ కార్పోరేషన్లో బీజేపీ పాలకవర్గమే ఉంది. బీజేపీ నేతృత్వంలోని మహాయుతి కూటమిలో అజిత్ పవార్ పార్టీ కూడా భాగస్వామిగా ఉంది.
ఈ నేపథ్యంలో దీనిపై ఉద్ధవ్ థాకరే వర్గం శివసేన పార్టీ నాయకుడు సంజయ్ రౌత్ స్పందించారు. బీజేపీ అవినీతి చేసిందని ఆరోపిస్తూ.. ఆ పార్టీతో కలిసి ప్రభుత్వంలో భాగస్వామిగా ఉండటం ఎందుకని రౌత్ ప్రశ్నించారు. అజిత్ పవార్ వర్గం ఎన్సీపీని శరద్‌పవార్ వర్గం ఎన్సీపీలో విలీనం చేయాలని అన్నారు. రెండు వర్గాలు కలిసిపోయి పుణె, పింప్రిచించ్వాడ్ లోకల్ బాడీ ఎన్నికల్లో పోటీ చేయాలని సూచించారు.
కాగా అజిత్ పవార్ 2023లో తన చిన్నాన్న నేతృత్వంలోని ఎన్సీపీని చీల్చారు. ఎనిమిది మంది ఎమ్మెల్యేలతో పార్టీని చీల్చి బీజేపీ నేతృత్వంలోని అధికార కూటమిలో కలిశారు. ఈ క్రమంలో అజిత్ పవార్ బీజేపీని విమర్శించడంపై సంజయ్ రౌత్ పైవిధంగా స్పందించారు.