భువనేశ్వర్: రోడ్డు పక్కన వదిలేసిన మూడు రోజుల పసిబిడ్డను ఒక మహిళ గమనించింది. సంతానం లేని ఆమె ఆ ఆడబిడ్డను పెంచి పెద్దచేసింది. ప్రేమమైకంలో మునిగిన 13 ఏళ్ల బాలిక ప్రియుడు, మరో ఫ్రెండ్‌తో కలిసి పెంచిన తల్లిని హత్య చేసింది. (Girl Kills Adopt mother) ఆలస్యంగా ఈ విషయం తెలుసుకున్న పోలీసులు నిందితులను అరెస్ట్ చేశారు. 14 ఏళ్ల కిందట ఒడిశా రాజధాని భువనేశ్వర్‌లో రోడ్డు పక్కన వదిలేసిన మూడు రోజుల పసికందును రాజలక్ష్మి దంపతులు చూశారు. సంతానం లేని ఆ దంపతులు ఆడబిడ్డను తమ సొంత బిడ్డలా పెంచారు.
కాగా, ఏడాది తర్వాత రాజలక్ష్మి భర్త మరణించాడు. అప్పటి నుంచి ఒంటరిగా అమ్మాయిని ఆమె పెంచింది. పెంపుడు కుమార్తెను కేంద్రీయ విద్యాలయంలో చదివించేదుకు గజపతి జిల్లా పర్లాఖేముండిలోని అద్దె ఇంటికి మారింది. ప్రస్తుతం 13 ఏళ్ల వయస్సున్న ఆ బాలిక 8వ తరగతి చదువుతున్నది. వయసులో పెద్దవారైన గణేష్ రత్, దినేష్ సాహుతో ఆమెకు స్నేహం ఏర్పడింది.
మరోవైపు ఇది తెలిసిన 54 ఏళ్ల రాజలక్ష్మీ, ఆ ఇద్దరు అబ్బాయిలతో సంబంధాన్ని వ్యతిరేకించింది. ఈ నేపథ్యంలో పెంపుడు తల్లిని హత్య చేయాలని ప్రియుడు రత్ ఆ బాలికను ప్రేరేపించాడు. ఆమె అడ్డు తొలగిపోతే తామిద్దరం ప్రేమించుకోవచ్చని, ఆమె ఆస్థి, నగలు, డబ్బు పొందవచ్చని నమ్మించాడు. దీంతో ఏప్రిల్ 29న పెంపుడు తల్లి రాజలక్మికి ఆ బాలిక నిద్రమాత్రలు ఇచ్చింది. స్పృహ కోల్పోయిన తర్వాత రత్, సాహుకు ఫోన్ చేసింది. వారు ఆ ఇంటికి రావడంతో ముగ్గురూ కలిసి దిండులతో ఊపిరాడకుండా చేసి రాజలక్ష్మిని చంపారు. ఆ తర్వాత ఆసుపత్రికి తీసుకెళ్లగా ఆమె మరణించినట్లు డాక్టర్లు నిర్ధారించారు.
కాగా, రాజలక్ష్మికి గతంలో గుండె సమస్య ఉండటంతో ఆమె గుండెపోటుతో చనిపోయినట్లు హాస్పిటల్ సిబ్బంది, ఆమె బంధువులను ఆ బాలిక నమ్మించింది. మరునాడు భువనేశ్వర్‌లో రాజలక్ష్మి అంత్యక్రియలు జరిగాయి. ఆ తర్వాత ఆ బాలిక తన మొబైల్ ఫోన్‌ను భువనేశ్వర్‌లోని ఇంట్లో మరిచిపోయింది. పర్లాఖేముండిలోని అద్దె ఇంటికి ఆమె చేరుకున్నది. రెండు వారాల తర్వాత రాజలక్ష్మి సోదరుడు శిబా ప్రసాద్ మిశ్రా బాలిక మొబైల్ ఫోన్ గమనించాడు. ఇన్‌స్ట్రాగ్రామ్‌లో రత్, సాహుతో ఆమె జరిపిన చాటింగ్‌ను ఆయన పరిశీలించాడు. దీంతో రాజలక్ష్మి హత్యకు సంబంధించిన వారి ప్లాన్ బయటపడింది.
మరోవైపు మే 14న రాజలక్ష్మి సోదరుడు శిబా ప్రసాద్ మిశ్రా, పర్లాఖేముండి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. దీంతో13 ఏళ్ల బాలిక, ఆమె ప్రియుడైన 21 ఏళ్ల గుడి పూజారి గణేష్ రత్, అతడి ఫ్రెండ్ 20 ఏళ్ల దినేష్ సాహూను పోలీసులు అరెస్ట్ చేశారు. రూ.2.4 లక్షలకు వారు తాకట్టుపెట్టిన రాజలక్ష్మి బంగారు ఆభరణాలను రికవరీ చేశారు. హత్యకు వినియోగించిన రెండు దిండ్లు, నిందితుల మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు పోలీస్ అధికారి తెలిపారు. ఈ షాకింగ్ ఘటనపై మరింతగా దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.