Congress president Elections | కాంగ్రెస్ అధ్యక్ష పదవికి ఎన్నికలు నిర్వహించనున్నట్లు ప్రకటన వెలువడడంతో అందరి దృష్టి జీ-23 నేతలపై పడింది. కాంగ్రెస్ పార్టీలో మూడోసారి అధ్యక్ష పదవికి పోటీ ఉంటుందా? అనే ప్రశ్న అందరిలోనూ మెదులుతున్నది. విశేషమేంటంటే.. గత మూడు దశాబ్దాల్లో కాంగ్రెస్ అధ్యక్ష పదవికి రెండుసార్లే ఎన్నికలు జరిగాయి. రాహుల్ గాంధీ అధ్యక్ష పదవిని చేపట్టేందుకు సిద్ధంగా లేకపోతే జీ-23కి చెందిన ఓ నేత పోటీ చేసే అవకాశం ఉందని తెలుస్తున్నది. శిశథరూర్, మనీశ్ తివారి, పృథ్వీరాజ్ చవాన్‌లు పోటీ చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం.
మరో వైపు కాంగ్రెస్ సీనియర్ నేత, జీ-23 నేత శశిథరూర్ పోటీ చేసే అవకాశాలను పరిశీలిస్తున్నట్లుగా తెలుస్తున్నది. అయితే, దీనిపై ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని, త్వరలోనే నిర్ణయం తీసుకోవచ్చని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. పార్టీ అధ్యక్ష పదవికి పోటీ చేస్తారా? లేదా? అన్నదానిపై వ్యాఖ్యానించేందుకు నిరాకరించారు. మలయాళ దినపత్రికకు రాసిన కాలమ్‌లో.. ‘స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా’ ఎన్నిక నిర్వహించాలని, కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ స్థానాలకు సైతం పార్టీ ఎన్నికలు నిర్వహించాలన్నారు.
పార్టీలో సంస్థాగత సంస్కరణలను డిమాండ్ చేస్తూ 2020లో కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీకి లేఖ రాసిన 23 మంది నేతల బృందంలో శశి థరూర్ కూడా ఉన్నారు. ‘కొత్త అధ్యక్షుడిని ఎన్నుకోవడం కాంగ్రెస్ పునరుజ్జీవనానికి ఒక ప్రారంభం మాత్రమే, ఇది కాంగ్రెస్‌కు చాలా అవసరం. ఎన్నికల కోసం చాలా మంది అభ్యర్థులు ముందుకు వస్తారని నేను ఆశిస్తున్నాను. పార్టీ, దేశం కోసం మీ అభిప్రాయాలను తెలియజేయడం ఖచ్చితంగా ప్రజల ఆసక్తిని రేకెత్తిస్తుంది’ అని థరూర్ పేర్కొన్నారు.
ఎన్నికలు ఇతర ప్రయోజనకరమైన ప్రభావాలను సైతం కలిగి ఉన్నాయని థరూర్ తెలిపారు. ఇదిలా ఉండగా.. కాంగ్రెస్‌లో అధ్యక్ష పదవికి రెండు సార్లు ఎన్నికలు జరిగాయి. 1997లో శరద్ పవార్, రాజేశ్ పైలట్, సీతారాం కేసరి పోటీ పడగా.. సీతారాం కేసరి విజయం సాధించారు. కేసరికి 6,624 ఓట్లు రాగా.. పవార్‌కు 882, పైలట్‌కు 354 ఓట్లు మాత్రమే వచ్చాయి. 2000లో జరిగిన ఎన్నికల్లో సోనియా గాంధీకి 7,448 ఓట్లు రాగా.. జితేంద్ర ప్రసాద్‌కు 94 వచ్చాయి.