ముంబై: లోక్‌సభ ఎంపీ శశిథూర్.. కులం గురించి కొన్ని ఆసక్తికర విషయాలు తెలిపారు. చాంపియన్ స్కూల్లో చదువుతున్న సమయంలో.. తన కులం గురించి తనకు తెలియదన్నారు. స్కూల్‌మేట్ ఒకరు తన కులం ఏంటని ప్రశ్నించాడని, అప్పుడు తాను ఇంటికి వెళ్లి తన తండ్రిని కులం గురించి అడిగానని చెప్పారు. ఆ సమయంలో తమ కులం ఏంటో తండ్రి చెప్పినట్లు శశిథరూర్ గుర్తు చేశారు. మనోరమ పత్రిక నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. తమది కేరళకు చెందిన నాయర్ల కుటుంబం అని, కానీ తన తండ్రి నాయర్‌ను తన పేరు నుంచి తీసివేసినట్లు వెల్లడించారు. కులం గురించి తెలుసుకోవాల్సిన అవసరం లేదని తమ పేరెంట్స్ చెప్పినట్లు శశిథరూర్ తెలిపారు. కులం ఆధారంగా తమ పేరెంట్స్ ఎవరినీ ట్రీట్ చేయలేదన్నారు.
కులం గురించి తెలియని ఎంపీ శశిథరూర్ మాత్రం కుల గణన చేపట్టాలని కాంగ్రెస్ చేస్తున్న డిమాండ్‌కు మద్దతు ఇస్తున్నారని కొందరు విమర్శిస్తున్నారు. కులం వల్ల ఏమైనా సమస్యలు ఉన్నాయా అని ఉన్నత కులస్థులను అడిగితే, వాళ్లు లేవని చెబుతారని, అదే ప్రశ్నను ఓ తక్కువ కులం వ్యక్తిని అడిగితే, ప్రతి రోజూ కులం సమస్యలను ఎదుర్కొన్నట్లు వాళ్లు చెబుతారని ఎంపీ శశిథరూర్ తెలిపారు. మన దేశంలో రాజకీయ పార్టీలు కులం ఆధారంగానే టికెట్లు ఇస్తున్నాయని, లబ్ధిదారుల్ని కూడా కులం ఆధారంగా ఎన్నుకుంటున్నారని తెలిపారు. కులం ఆధారంగానే ప్రభుత్వం కూడా రిజర్వేషన్లు కల్పిస్తున్నట్లు ఎంపీ శశి వెల్లడించారు. కులం అంశాన్ని విస్మరించలేమన్నారు.
ఒకప్పుడు తమ పార్టీలో చేరాలని బీజేపీ తనను అప్రోచ్ అయినట్లు శశిథరూర్ వెల్లడించారు. వాజ్‌పేయి ప్రభుత్వ సమయంలో ఓ మంత్రి తన న్యూయార్క్ ఆఫీసుకు వచ్చి ఆ ఆఫర్ ఇచ్చినట్లు చెప్పారు. దేశాన్ని బీజేపీ చూస్తున్నం కోణం వేరని, తాను చూస్తున్న కోణం వేరు అని ఆయన అన్నారు. ఒకవేళ తాను బీజేపీలో చేరితే, అప్పుడు తన పుస్తకాలను తగలబెట్టాల్సి ఉంటుందని ఓ రీడర్ అభిప్రాయపడినట్లు శశిథరూర్ తెలిపారు. నేతలు పార్టీలు మారడం గురించి మాట్లాడుతూ రాజకీయాలంటే హోదా కాదు అని, విలువలు పాటించాలన్నారు.