బీజేపీ విభజన రాజకీయాల గురించి ఎన్సీపీ అధినేత శరద్ పవార్ ఏనాడో తమకు చెప్పారని శివసేన ఎంపీ సంజయ్ రౌత్ అన్నారు. అయితే తాము మాత్రం చాలా ఆలస్యంగా గ్రహించామని పేర్కొన్నారు. 25 ఏళ్ల కిందటే బీజేపీ విభజన రాజకీయాల గురించి పవార్ తమతో కూలంకశంగా చెప్పారని, తాము మాత్రం 2019 లోనే వాటి స్వరూప, స్వభావాలను తాము తెలుసుకున్నామని తెలిపారు.
”నేమ్కేచ్ బోల్నే” (తక్కువగా మాట్లాడటం) పేరుతో శరద్ పవార్ రాజకీయ ప్రసంగాలకు సంబంధించిన పుస్తకావిష్కరణలో రౌత్ పాల్గొన్నారు. దేశఐక్యతను బీజేపీ ఏమాత్రం కోరుకోదని పవార్ తమతో అన్నారని, బీజేపీ సిద్ధాంతాలు దేశాన్ని వెనక్కి తీసుకెళ్తాయన్న విషయాన్ని కూడా తమతో పవార్ చెప్పారని రౌత్ గుర్తు చేసుకున్నారు. ఈ పుస్తకాన్ని ప్రధాని మోదీకి బహుమతిగా ఇస్తే బాగుంటుందని, ఆయనకు కొన్ని విషయాలు తెలిసొస్తాయని రౌత్ దెప్పిపొడిచారు.