Sharad Pawar | ముంబై, మే 2: ఎన్సీపీ నాయకురాలు, శరద్ పవార్ కూతురు సుప్రియా సూలె 13 రోజుల క్రితం చెప్పిన రెండు రాజకీయ భూకంపాల్లో ఒకటి మంగళవారం సంభవించింది. నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ) అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తున్నట్టు శరద్ పవార్(82) ప్రకటించడం మహారాష్ట్ర రాజకీయాల్లో పెను ప్రకంపనలు సృష్టించింది. తన ఆత్మ కథ ‘లోక్ మాజే సంగటి(ప్రజలు నాకు తోడుగా ఉంటారు) మరాఠీ పుస్తకావిష్కరణ సభ సాక్షిగా పవార్ రాజీనామా ప్రకటన చేయడంతో ఎన్సీపీ శ్రేణులు దిగ్భ్రాంతి చెందాయి. నిర్ణయాన్ని వెనక్కి తీసుకోమని అధినేతను కార్యకర్తలు, నాయకులు కన్నీళ్లతో వేడుకున్నారు. అయితే తన నిర్ణయంపై వెనక్కు తగ్గేదేలేదని మొదట భీష్మించిన శరద్ పవార్, ఆ తర్వాత పునరాలోచన చేయడానికి రెండు-మూడు రోజుల సమయం కోరారు. తన ఆత్మకథ పుస్తకావిష్కరణలో శరద్ మాట్లాడుతూ తన రాజ్యసభ సభ్యత్వం ఇంకో మూడేండ్లు ఉన్నదని, ఈ సమయంలో తాను మహారాష్ట్ర, దేశానికి సంబంధించిన సమస్యలపైన దృష్టి సారించాల్సిన అవసరమున్నదని తెలిపారు. తాను ఎన్సీపీ కార్యకర్తలను వెంట ఉండి నడిపిస్తానని, కానీ అది పార్టీ అధ్యక్ష హోదాలో ఉండి మాత్రం కాదని తెలిపారు.
శరద్ పవార్ రాజీనామాకు ఆయన సోదరుడి కుమారుడు, ఎన్సీపీ సీనియర్ నేత అజిత్ పవారే కారణమని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. బీజేపీతో చేతులు కలిపి తాను ఇప్పుడే మహారాష్ట్ర సీఎం కావడంలో తప్పేముందని అజిత్ పవార్ ఇటీవల వ్యాఖ్యానించారు. ఎన్సీపీలో ఇన్ని రాజకీయాలు జరుగుతున్నా అజిత్ పవార్‌పై శరద్ పవార్ ఎలాంటి చర్యలు తీసుకోలేదు. అయితే అజిత్ పవార్ నిర్ణయంపై శరద్ పవార్ పైకి అన్యమనస్కంగా కనిపిస్తున్నా లోలోపల ఈ విషయంలో సుముఖత వ్యక్తం చేసినట్టు ఇటీవలి పరిణామాలను పరిశీలిస్తే అర్థమవుతున్నది. అదానీపై జేపీసీ విచారణ డిమాండ్ వ్యవహారంలో అదానీకి సానుకూలంగా మాట్లాడటం, పైగా గౌతమ్ అదానీతో శరద్ పవార్ సమావేశం కావడం ఈ వాదనలకు బలం చేకూరుస్తున్నాయి.
2024 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీని ఓడించడానికి విపక్ష పార్టీలను ఏకం చేస్తానని చెప్పిన శరద్ పవార్ ఒక్కసారిగా రాజీనామా బాంబు పేల్చడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. మరోవైపు ఎన్సీపీలోని 53 మంది ఎమ్మెల్యేలలో 34 మంది అంతర్గతంగా అజిత్ పవార్‌కు మద్దతు తెలుపుతున్నారు. మహా వికాస్ అఘాడీ కూటమిపై తిరుగుబాటు ప్రకటించిన 16 మంది శివసేన ఎమ్మెల్యేలపై సుప్రీం కోర్టు త్వరలో అనర్హత వేటు వేసే అవకాశాలు ఉండటంతో అజిత్ పవార్ సాయంతో అధికారాన్ని నిలబెట్టుకోవాలని బీజేపీ ప్రయత్నిస్తుండటమే అటు మహారాష్ట్ర రాజకీయాల్లో, ఇటు ఎన్సీపీలో ప్రకంపనలకు కారణమవుతున్నది. శరద్ పవార్ ఇటీవల పార్టీ యువ విభాగాన్ని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు కూడా ఇందుకు బలం చేకూరుస్తున్నాయి. ‘సరైన సమయంలో రొట్టె ఇంకో పక్కకు తిరగాలని నాకొకరు చెప్పారు. అలా చేయకపోతే అది మాడిపోయి చేదెక్కుతుంది’ అని శరద్ పవార్ అన్నారు. అయితే అజిత్ పవార్ తదుపరి నిర్ణయం తీసుకోవడానికి అనువుగానే ఎన్సీపీ అధినేత ఈ వ్యాఖ్యలు చేశారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
ఎన్సీపీ అధినేత రాజీనామా ప్రకటనపై శివసేన(యూబీటీ) నేత సంజయ్ రౌత్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. మహారాష్ట్ర రాజకీయాల్లో చరిత్ర పునరావృతమవుతుందన్నారు. నీచ రాజకీయాలకు విసుగు చెందిన అప్పటి శివసేన అధినేత బాల్ ఠాక్రే పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేశారని, కానీ శివ సైనికుల ప్రేమానురాగాల కారణంగా నిర్ణయాన్ని వెనక్కు తీసుకొన్నారన్నారని గుర్తు చేశారు. ఇప్పుడు శరద్ పవార్ విషయంలోనూ అదే జరగొచ్చని అభిప్రాయపడ్డారు.
ఎన్సీపీ ఎమ్మెల్యేలు బీజేపీ కూటమిలో చేరి ప్రభుత్వంలో భాగస్వామి కావాలని కోరుకుంటున్నారు. ఇలా చేయడం వల్ల అజిత్ పవార్ కుటుంబం, ప్రఫుల్ పటేల్, హసన్ ముష్రీఫ్ తదితర నేతలపై ఈడీ సహా ఇతర కేంద్ర దర్యాప్తు సంస్థలు దాడులు చేయవని వారు భావిస్తున్నారు. అయితే ఏక్నాథ్ షిండేలాగా అజిత్ పవార్ పార్టీని చీల్చాలనుకోవడం లేదు! చాలా మంది ఎమ్మెల్యేలు కూడా శరద్ పవార్ ఆశీర్వాదం లేకుండా ముందడుగు వేయడం మంచిది కాదని అనుకుంటున్నారు. కానీ ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో ‘రొట్టెను తిప్పడానికి’ ఇదే సరైన సమయమని శరద్ పవార్ భావించడంతో మహారాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇక రానున్న రెండు రోజుల్లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయోనని ఆసక్తి నెలకొంది.