Shama Mohamed : రోహిత్ శర్మ (Rohit Sharma) లావుగా ఉన్నాడంటూ బాడీ షేమింగ్ (Body Shaming) పోస్టు చేసిన కాంగ్రెస్ పార్టీ మహిళా నాయకురాలు, మాజీ స్పోర్ట్స్ జర్నలిస్టు షామా మహ్మద్ (Shama Mohamed) పై విమర్శల వర్షం కురుస్తోంది. రోహిత్ శర్మ అభిమానులు, క్రికెట్ ప్రేమికులు సోషల్ మీడియాలో షామాపై విమర్శలు గుప్పిస్తున్నారు. షామా మహ్మద్ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి కూడా కావడంతో ఆమె వ్యాఖ్యలపై రాజకీయంగా కూడా దుమారం రేగుతోంది. బీజేపీ నేతలు కాంగ్రెస్ పార్టీపై, రాహుల్‌గాంధీపై కౌంటర్ కామెంట్స్ చేస్తున్నారు.
దాంతో ఈ వ్యవహారంపై కాంగ్రెస్ అధిష్ఠానం స్పందించింది. రోహిత్ శర్మపై షామా మహ్మద్ పోస్టుతో తమ పార్టీకి సంబంధం లేదని తెలిపింది. ఆ వివాదాస్పద పోస్టును డిలీట్ చేయాలని ఆమె ఆదేశించినట్లు వెల్లడించింది. ఈ మేరకు కాంగ్రెస్ సీనియర్ నాయకుడు పవన్ ఖేరా తన అధికారిక ఎక్స్ ఖాతాలో ఒక పోస్టు పెట్టాడు. పార్టీ ప్రకటన చేసిన కాసేపటికే షామా మహ్మద్ తన పోస్టును డిలీట్ చేశారు. అయితే ఆమె ఇంతవరకు రోహిత్ శర్మకు క్షమాపణ తెలియజేయలేదు.