న్యూఢిల్లీ, ఏప్రిల్ 22: యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) నిర్వహించిన సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్- 2024 ఫలితాల్లో నారీశక్తి ప్రతిబింబించింది. టాప్-5లో ముగ్గురు యువతులు ఉండగా, టాప్-20లో ఏకంగా 11 మంది చోటు దక్కించుకున్నారు. ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌కు చెందిన శక్తి దూబేను మొదటి ర్యాంకు వరించింది. హర్షితా గోయల్‌కు రెండో ర్యాంకు, షా మార్గి చిరాగ్ నాలుగో ర్యాంకు దక్కించుకున్నారు. డోంగ్రే అర్చిత్ పరాగ్‌కు మూడో ర్యాంకు, ఆకాశ్ గార్గ్‌కు ఐదో ర్యాంకు లభించినట్లు యూపీఎస్సీ మంగళవారం ప్రకటించింది. ప్రథమ ర్యాంకర్ శక్తి దూబే యూపీలోని అలహాబాద్ యూనివర్సిటీ నుంచి బయోకెమిస్ట్రీలో బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ డిగ్రీ పొందారు.
ఆప్షనల్ సబ్జెక్టుగా పొలిటికల్ సైన్స్, ఇంటర్నేషనల్ రిలేషన్స్ తీసుకుని ఆమె పరీక్షలో ప్రథమ ర్యాంకు సాధించినట్లు యూపీఎస్సీ తెలిపింది. రెండవ ర్యాంకు సాధించిన హర్షితా గోయల్ ఎంఎస్ యూనివర్సిటీ ఆఫ్ బరోడా నుంచి బీకాం పట్టభద్రురాలు. మూడో ర్యాంకు సాధించిన డోంగ్రే అర్చిత్ పరాగ్ తమిళనాడులోని వెల్లూరు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(విట్) నుంచి ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్‌లో బీటెక్ పట్టభద్రుడు. నాలుగో ర్యాంకు సాధించిన షా మార్గి చిరాగ్ అహ్మదాబాద్‌లోని గుజరాత్ టెక్నలాజికల్ యూనివర్సిటీ నుంచి కంప్యూటర్ ఇంజనీరింగ్‌లో బీఈ పట్టా పొందారు. ఐదో ర్యాంకర్ ఆకాశ్ గార్గ్ ఢిల్లీలోని గురు గోబింద్ సింగ్ ఇంద్రప్రస్థ యూనివర్సిటీలో కంప్యూటర్ సైన్స్‌లో బీటెక్ డిగ్రీ పొందారు. మరోవైపు, ఫలితాల్లో తెలంగాణ అభ్యర్థులు సత్తా చాటారు. వరంగల్‌కు చెందిన సాయి శివాని 11వ ర్యాంకు సాధించారు.
1,008 మంది ఎంపిక..
ఏటా సివిల్ సర్వీసెస్ పరీక్షలు ప్రిలిమినరీ, మెయిన్, ఇంటర్వ్యూ అనే మూడు దశలలో జరుగుతాయి. ఐఏఎస్, ఐఎఫ్ఎస్, ఐపీఎస్‌తోపాటు ఇతర సర్వీసుల కోసం ఈ పరీక్షలను యూపీఎస్సీ నిర్వహిస్తుంది. సివిల్ సర్వీసెస్(ప్రిలిమనరీ) ఎగ్జామినేషన్- 2024 గత ఏడాది జూన్ 16న జరిగింది. మొత్తం 9,92,599 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా వారిలో 5,83,213 మంది మాత్రమే పరీక్షకు హాజరయ్యారు. లిఖిత(మెయిన్) పరీక్షకు 14,627 మంది అభ్యర్థులు అర్హత సాధించగా 2024 సెప్టెంబర్‌లో పరీక్ష నిర్వహించారు. వీరిలో 2,845 మంది అభ్యర్థులు పర్సనాలిటీ టెస్ట్ లేక ఇంటర్వ్యూకు క్వాలిఫై అయ్యారు. ఈ ఏడాది జనవరి 7 నుంచి ఏప్రిల్ 17 మధ్య ఇంటర్వ్యూలు జరిగాయి. వీరిలో 1008 మంది అభ్యర్థులను(725 మంది పురుషులు, 284 మంది మహిళలు) వివిధ సర్వీసులలో నియామకం కోసం యూపీఎస్సీ సిఫార్సు చేసింది. సివిల్ సర్వీసెస్ పరీక్షలో విజయం సాధించిన అభ్యర్థులలో జనరల్ క్యాటగిరీ నుంచి 335 మంది, ఈడబ్ల్యూసీ నుంచి 109 మంది, ఇతర వెనుకబడిన వర్గాల నుంచి 318 మంది, ఎస్సీల నుంచి 160 మంది, ఎస్టీల నుంచి 87 మంది ఉన్నట్టు యూపీఎస్సీ తెలిపింది.