ముంబై (నమస్తే తెలంగాణ): మహారాష్ట్రలో మహావికాస్ అఘాడీ కూటమిలో లుకలుకలు ప్రారంభమయ్యాయి. లోక్సభ ఎన్నికల సమయంలో సాంగ్లి స్థానంపై పోటీ విషయంపై కాంగ్రెస్, శివసేన(యూబీటీ) మధ్య విభేదాలు పొడచూపగా.. ఇప్పుడు రాష్ట్రంలో త్వరలో జరుగనున్న ఎమ్మెల్సీ ఎన్నికలు మరోసారి చిచ్చుపెట్టాయి. ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని శివసేన (యూబీటీ) ఏకపక్షంగా తన అభ్యర్థుల్ని ప్రకటించటాన్ని కాంగ్రెస్ తీవ్రంగా తప్పుబట్టింది. కొంకణ్ పట్టభద్రుల, నాసిక్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాల్లో పోటీ నుంచి తప్పుకోవాలని ఠాక్రేను కాంగ్రెస్ కోరింది.
కూటమిలో భాగస్వామ్యపక్షాలను సంప్రదించకుండా, ఉద్ధవ్ ఠాక్రే ఏకపక్షంగా అన్ని ఎమ్మెల్సీ స్థానాలకు అభ్యర్థుల్ని ప్రకటించారని మహారాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు నానా పటోలే మీడియా ముఖంగా ఆరోపించారు. ముంబై, కొంకణ్ పట్టభద్రుల స్థానాలకు, ముంబై, నాసిక్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాలకు జూన్ 26న ఎన్నికలు జరగబోతున్నాయి. సార్వత్రిక ఎన్నికల్లో సాంగ్లి స్థానంలో కాంగ్రెస్ నేత విశాల్ పాటిల్ స్వతంత్ర అభ్యర్థిగా పోటీలో నిలబడి.. గెలుపొందటం శివసేనకు షాకిచ్చింది. సాంగ్లిలో ఓటమికి ప్రతీకారంగా ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికల్లో తన అభ్యర్థుల్ని శివసేన (యుబీటీ) నిలబెట్టినట్టు రాజకీయ వర్గాలు అంటున్నాయి.
కూటమిలో భాగంగా కొంకణ్ గ్రాడ్యుయేట్, నాసిక్ ఎమ్మెల్సీ స్థానాల్లో పోటీచేయాలని కాంగ్రెస్ భావిస్తున్నది. ముంబైలోని రెండు సీట్లను ఉద్ధవ్ ఠాక్రే గ్రూపునకు వదిలేందుకు సిద్ధమైంది. అయితే అన్ని స్థానాలకు శివసేన(యూబీటీ) తన అభ్యర్థులను ప్రకటించడంపై కాంగ్రెస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాను ఇంతకుముందు ఠాక్రేకు ఫోన్ చేసి, సీట్ల పంపకంపై చర్చించానని, చెరో రెండు సీట్లలో పొటీచేద్దామని చెప్పానని నానా పటోలే చెబుతున్నారు. కాంగ్రెస్ అభ్యర్థుల ఎవరనే వివరాలు అడిగిన ఠాక్రే.. అన్ని స్థానాలకు వాళ్ల పార్టీ అభ్యర్థులను ప్రకటించేశారని అసంతృప్తి వ్యక్తం చేశారు. దీనిపై ఠాక్రేను సంప్రదించేందుకు ప్రయత్నిస్తున్నప్పటికీ, ఆయన అందుబాటులోకి రాలేదన్నారు.