Shah Rukh Khan: గూఢచర్యం కేసులో ఖతార్‌లో అరెస్టయిన భారత మాజీ నావికుల విడుదలలో షారూఖ్ ఖాన్ పాత్రేమీ లేదని ఆయన టీమ్ వెల్లడించింది. షారూఖ్ ఖాన్ జోక్యంతోనే భారత నావికులు విడుదలయ్యారని మీడియాలో జరుగుతున్న ప్రచారంలో నిజం లేదని తెలిపింది. అయితే, భారత నావికుల విడుదలపై షారూఖ్ ఖాన్ సంతోషం వ్యక్తం చేశారని, వారికి ఆల్ ది బెస్ట్ చెప్పారని పేర్కొంది. ఈ మేరకు షారూఖ్ టీమ్ ఒక ప్రకటన విడుదల చేసింది.
కాగా, గూఢచర్యం ఆరోపణలతో ఖతార్‌లో అరెస్టయిన భారత నావికుల విడుదలలో షారూఖ్ ఖాన్ పాత్ర ఉందని రెండు రోజులుగా మీడియాలో ప్రచారం జరిగింది. కేంద్ర మాజీ మంత్రి సుబ్రమణ్యస్వామి కూడా మంగళవారం ఉదయం ఎక్స్‌లో పెట్టిన పోస్టులో ఇదే విషయాన్ని పేర్కొన్నారు. భారత మాజీ నావికుల విడుదలకు ఖతార్ షేక్‌లను ఒప్పించడం మోదీ సర్కారువల్ల కాలేదని, షారూఖ్ జోక్యంతో వారు విడుదలయ్యారని ఆయన పోస్టు చేశారు.