న్యూఢిల్లీ: యువతులు లైంగికపరమైన కోరికలను నియంత్రించుకోవాలని చెప్పిన కలకత్తా హైకోర్టును సుప్రీంకోర్టు శుక్రవారం తప్పుబట్టింది. ఇటువంటి వ్యాఖ్యలు తీవ్ర అభ్యంతరకరమని, సమర్థనీయం కాదని తెలిపింది. రాజ్యాంగంలోని అధికరణ 21 ప్రకారం యువతకు గల హక్కులను ఈ సలహాలు పూర్తిగా ఉల్లంఘిస్తున్నట్లు తెలిపింది.
న్యాయమూర్తులు వ్యక్తిగత అభిప్రాయాలను వ్యక్తం చేయకూడదని, బోధించకూడదని తెలిపింది. కలకత్తా హైకోర్టు 2023 అక్టోబరు 18న ఇచ్చిన తీర్పులో, ‘ప్రతి యువతి సెక్స్ కోరికలను నియంత్రించుకోవాలి. రెండు నిమిషాల సుఖం కోసం లొంగిపోతే, వారు సమాజం దృష్టిలో అన్నీ కోల్పోయిన వారవుతారు’ అని తెలిపింది. దీనిపై సుప్రీంకోర్టు స్వయంగా విచారణ ప్రారంభించింది.