బెంగళూరు: కాంగ్రెస్ పాలిత కర్ణాటకలో ఆడబిడ్డలకు రక్షణ కరువైంది. తన ప్రేమ ప్రతిపాదనను తిరస్కరించిందన్న కోపంతో ఒక యువకుడు అందరూ చూస్తుండగానే ఒక యువతిని ఆమె పీజీ వసతి గృహం ముందు లైంగికంగా వేధించిన ఘటన బెంగళూరులో చోటుచేసుకుంది. 29 ఏండ్ల నిందితుడు నవీన్ కుమార్ సోమవారం జ్ఞానజ్యోతినగర్లో మెయిన్ రోడ్‌పై ఉన్న పీజీ వసతి గృహానికి కారులో వచ్చాడు. హాస్టల్ నుంచి బయటకు వచ్చిన యువతిని రోడ్డుపై పట్టుకుని అనుచితంగా తాకుతూ, ఆమె బట్టలు చింపడానికి ప్రయత్నించాడు. దీంతో ఆమె సహాయం కోసం కేకలు వేసింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు నిందితుడిని అరెస్ట్ చేసినట్టు పోలీసులు తెలిపారు. ఏడాది క్రితం ఒక రియల్ ఎస్టేట్ కంపెనీలో పనిచేస్తుండగా, ఇద్దరికీ ఏర్పడిన పరిచయం తర్వాత స్నేహంగా మారింది. అయితే తర్వాత అతడి ప్రపోజల్‌ను ఆమె తిరస్కరించింది.
పదేండ్ల బాలికపై హత్యాచారం ; బీజేపీ పాలిత ఒడిశాలో దారుణం.. నిందితుడి ఇల్లు ధ్వంసం
భువనేశ్వర్: బీజేపీ పాలిత ఒడిశాలో దారుణం చోటుచేసుకుంది. భద్రక్ జిల్లా బాలిగావ్ గ్రామంలో పదేండ్ల బాలిక హత్యాచారానికి గురైంది. హత్యకు ముందు బాధితురాలిపై పలుమార్లు లైంగికదాడి జరిగినట్టు పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో తేలింది. ఈ ఘటన రాష్ట్రంలో సంచలనం రేపింది. బాలిగావ్, చుట్టుపక్కల గ్రామాల ప్రజలు పెద్ద ఎత్తున రోడ్లమీదికి వచ్చి ఆందోళనకు దిగారు. దోషిని కఠినంగా శిక్షించాలంటూ బుధవారం ప్రధాన నిందితుడి ఇంటిని ధ్వంసం చేశారు. విపక్షాలు గురువారం ఆరు గంటల బంద్‌కు పిలుపునిచ్చాయి. మంగళవారం స్కూల్‌కు వెళ్లిన మైనర్ బాలిక ఇంటికి తిరిగి రాకపోవటంతో పోలీసులకు ఫిర్యాదు అందింది. కొన్ని గంటల అనంతరం గ్రామానికి సమీపంలోని చెట్ల పొదల్లో ఆమె మృతదేహం లభ్యమైంది.