బెంగళూరు: ఒక మహిళను దారుణంగా హత్య చేశారు. తలతోపాటు శరీర భాగాలను ముక్కలుగా నరికారు. వాటిని పలు ప్రాంతాల్లో పడేశారు. చేతి భాగాన్ని కుక్క లాక్కెళ్తుండగా స్థానికులు చూసి షాకయ్యారు. (Karnataka horror) ఈ విషయం తెలుసుకున్న పోలీసులు పది ప్రాంతాల్లో పడేసిన శరీర భాగాలను సేకరించారు. కర్ణాటకలోని తుమకూరు జిల్లాలో ఈ షాకింగ్ సంఘటన జరిగింది. ఆగస్ట్ 7న చింపుగనహళ్లిలోని ముత్యాలమ్మ ఆలయం సమీపంలో చెట్లపొదల నుంచి తెగిన చేతిని ఒక కుక్క రోడ్డుపైకి లాక్కొచ్చింది. ప్లాస్టిక్ కవర్లో చుట్టి ఉన్న మరో చేతిని కూడా స్థానికులు చూసి భయాందోళన చెందారు. పోలీసులకు సమాచారం ఇచ్చారు.
కాగా, లింగపుర రోడ్ వంతెన సమీపంలో పేగు భాగాలు, బెండోన్ నర్సరీ సమీపంలో కడుపు, ఇతర అంతర్గత అవయవాలు కనిపించాయి. జోనిగరహళ్లి సమీపంలో రక్తంతో తడిసిన బ్యాగ్‌తో పాటు ఒక కాలు, సిద్దరబెట్ట, నెగలాల్ మధ్య రోడ్డులో రెండు బ్యాగుల్లో మరిన్ని శరీర భాగాలు పడి ఉన్నాయి.
మరోవైపు శుక్రవారం మధ్యాహ్నం సిద్దరబెట్ట సమీపంలో మహిళ తల భాగం బయటపడింది. కొరటగెరె, కోలాల పోలీస్ స్టేషన్ల పరిధిలోని పది ప్రాంతాల్లో పడేసిన మహిళ శరీర భాగాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. చేతులపై పచ్చబొట్లు, ముఖ ఆనవాళ్ల ద్వారా హతురాలిని 42 ఏళ్ల లక్ష్మీదేవమ్మగా గుర్తించారు.
కాగా, బెల్లావికి చెందిన ఆ మహిళ ఆగస్ట్ 3న తన కుమార్తెను చూడటానికి ఉర్డిగెరెకు వెళ్లింది. ఆ రాత్రి ఇంటికి తిరిగి రాకపోవడంతో భార్య అదృశ్యంపై భర్త బసవరాజు ఆగస్ట్ 4న బెల్లావి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. ఈ నేపథ్యంలో లక్ష్మీదేవమ్మను హత్య చేసి మృతదేహాన్ని ముక్కలుగా నరికి పలు ప్రాంతాల్లో పడేయడంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నిందితులను గుర్తించేందుకు ఆయా ప్రాంతాల్లోని సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలిస్తున్నారు.
Also Read:
Wall Collapses | భారీ వర్షానికి కూలిన గోడ.. పిల్లలు, మహిళలతో సహా ఏడుగురు మృతి
Election Commission | 334 రాజకీయ పార్టీలను.. జాబితా నుంచి తొలగించిన ఈసీ